
హెల్ ఫోన్
* హస్తభూషణంగా మారిన సెల్‌ఫోన్
* సైబర్ నేరాలకు ఇదే ప్రధాన ఆధారం
* వంచకులకూ కలిసి వస్తున్న వైనం
* పరిజ్ఞానంతో పాటే పెరుగుతున్న ముప్పు
బంగారు భవిష్యత్తు పేరుతో దాదాపు ఐదు వేల మందిని సంప్రదించి... మాటలు నమ్మిన 300 మంది యువతులను వంచించిన మాయగాడు మధు పోలీసులకు చిక్కాడు.
నాచారంలో పిజ్జా డెలివరీ బాయ్‌గా పని చేస్తున్న లక్ష్మణ్... ఉద్యోగం నేపథ్యంలో తెలిసిన యువతుల ఫోన్ నెంబర్లకు అసభ్యకర సందేశాలు పంపించి అరెస్టయ్యాడు.
మాట్రిమోనియల్ సైట్స్‌లో రిజిస్టర్ చేసుకున్న 700 మంది మహిళలు... యువతులకు ఎర వేసి... 30 మందిని ముంచిన శశి కుమార్ కటకటాల్లోకి చేరాడు.
పేట్ బషీరాబాద్ పరిధిలో నివసించిన కనకవ్వకు భర్త నర్సింహతో స్పర్థలు ఉండేవి. ఓ వ్యక్తి నుంచి ఆమె సెల్‌కు వచ్చిన మిస్డ్ కాల్‌ను అపార్థం చేసుకున్న భర్త విచక్షణా రహితంగా కొట్టడంతో కనకవ్వ మరణించింది. ...ఈ నేరాలన్నింటికీ మూలం సెల్‌ఫోన్... దాని నెంబర్. ప్రస్తుతం ఫోను లేనిదే రోజు గడవని పరిస్థితులు తలెత్తాయి. మొబైల్స్‌లో పెరుగుతున్న టెక్నాలజీతో పాటు దాని సంబంధిత నేరాలూ పెరుగుతున్నాయి. సెల్‌ఫోన్ నెంబర్లకు గోప్యత లేకపోవడం... పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ కొరవడడం... నానాటికీ తెలివి మీరుతున్న నేరగాళ్లు/కీచకులు ఫోన్ ఆధారిత నేరాలు పెరగడానికి కారణమవుతున్నారని నిపుణులు చెబుతున్నారు.
నెంబర్ల సేకరణకు మార్గాలెన్నో...
అనేక నేరాలకు సెల్‌ఫోన్ నెంబర్ సేకరించడమే నాందిగా మారింది. ఇలా ఫోన్ నెంబర్లు తీసుకోవడానికి నేరగాళ్లకు అనేక మార్గాలు ఉంటున్నాయి. వ్యాపార సముదాయాల్లో కూపన్లు నింపడం... ఆన్‌లైన్‌లో షాపింగ్స్ చేయడం... సోషల్ మీడియాలో రిజిస్ట్రేషన్లు... ఇలాంటి మార్గాల్లో సెల్‌ఫోన్ నెంబర్లు/ఈ-మెయిల్స్ డేటాబేస్ ఇంటర్‌నెట్‌లో అమ్మకానికి ఉంటున్నాయి. ఆన్‌లైన్‌లో కేవలం రూ.వెయ్యి చెల్లిస్తే చాలు 30 వేల మంది వివరాలు అందించే సైట్లు కోకొల్లలు. 'డీఎన్‌డీ'(డునాట్ డిస్ట్రబ్) సదుపాయం లేని ఫోనుకు వచ్చే వాణిజ్య ప్రకటనల ఫోన్లు... ఎస్సెమ్మెస్‌లకూ ఇలాంటి డేటాబేస్‌లే కారణం. ఈ రకంగా ఫోన్ నెంబర్లు సేకరిస్తున్న నేరగాళ్లు మోసాలకు తెర తీస్తున్నారు.
అత్యధిక శాతం 'ఫోన్'తోనే ప్రారంభం
దేశ వ్యాప్తంగా నమోదవుతున్న సైబర్ నేరాల్లో అత్యధికం బాధితుల ఫోన్లను టార్గెట్‌గా చేసుకుని ప్రారంభమవుతున్నవే. సంక్షిప్త సందేశం పంపడం... కాల్ చేయడంతోనే నేరగాళ్లు వీటికి శ్రీకారం చుడుతున్నారు. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే 60 శాతం సైబర్ నేరాలకు ఫోనే మూలమని సీఐడీ అధికారులు చెబుతున్నారు. ఒకప్పుడు ఈ-మెయిల్ ద్వారా ఎరవేసే 'ఫిష్షింగ్'స్థానంలో ఇప్పుడు సెల్‌ఫోన్లను టార్గెట్‌గా చేసుకుని ప్రారంభించే ‘విష్షింగ్’ పెరుగుతోందని స్పష్టం చేస్తున్నారు. వేధింపులు, వంచనలు, లాటరీ ఫ్రాడ్స్... ఇలా ఒకటేమిటి... 'విష్షింగ్'తో సాధ్యం కానిదంటూ లేదన్నట్లు పరిస్థితుల్లో మార్పు వచ్చిందని నిపుణులు వివరిస్తున్నారు.
'ఎండ్'పెరిగే కొద్దీ ముప్పే...
ఒకప్పుడు బేసిక్ సెల్‌ఫోన్లు ఉండేవి. వీటిలో సౌకర్యాలు తక్కువైనా భద్రత ఎక్కువ. రానురాను ఆండ్రాయిడ్, విండోస్ ఇలా వివిధ రకాలైన హైఎండ్ టెక్నాలజీ సెల్‌ఫోన్లలో అందుబాటులోకి వచ్చింది. ఇలా ‘ఎండ్’ పెరిగే కొద్దీ అందులో సదుపాయాలతో పాటు హ్యాకింగ్ ముప్పూ ఎక్కువైందని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం దేశంలో వినియోగంలో ఉన్న ఫోన్లలో 64 శాతం ఆండ్రాయిడ్‌తో కూడినవని ఓ సర్వే నిర్థారించింది. వీటికి ఎస్సెమ్మెస్, వాట్సాప్ మెసేజ్, కొత్త అప్లికేషన్లలో ఏదో ఒక రూపంలో సైబర్ నేరగాళ్లు 'ర్యాట్స్'(రియోట్ యాక్సిస్ ట్రోజన్స్) పంపిస్తున్నారు. వీటిని ఓపెన్ చేస్తే చాలు మన ఫోన్ వారి ఆధీనంలోకి వె ళ్లిపోతుంది. కాంటాక్ట్స్ నుంచి కెమెరా వరకు అన్నీ సైబర్ నేరగాళ్లు తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. ఈ-మెయిల్ హ్యాకింగ్ కంటే మొబైల్ హ్యాకింగ్ చాలా తేలికని ఆ రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే రక్షణ రంగంలో పని చేస్తున్న వారికి హైఎండ్ ఫోన్ల వినియోగం తగ్గించాలంటూ మార్గదర్శకాలు జారీ అయ్యాయి.
'ప్రీ-పెయిడ్'నెంబర్లు శాశ్వతం కాదు...
వినియోగంలో ఉన్న సెల్‌ఫోన్ నెంబర్లలో అత్యధికంగా ప్రీ-పెయిడ్ కేటగిరీకి చెందినవే. వీటి 'మార్పిడి'విషయం తెలియక కొందరు చిక్కుల్లో పడుతున్నారు. ఓ వ్యక్తి ప్రీ-పెయిడ్ కనెక్షన్ తీసుకున్న తరవాత నిర్ణీత కాలం దాన్ని వినియోగించకపోతే... సర్వీస్ ప్రొవైడర్ ఆ కనెక్షన్‌ను రద్దు చేస్తారు. ఆపై అదే నెంబర్‌ను మరొకరికి కేటాయించేస్తారు. ఈ విషయం తెలియక అనేక మంది తన స్నేహితుడే అని భావించి ప్రీ-పెయిడ్ నెంబర్లకు అభ్యంతరకర, అశ్లీల సందేశాలు పంపిస్తుంటారు. ఆ ప్రీ-పెయిడ్ నెంబర్ యువతులు, మహిళలకు కేటాయించి ఉంటే... పంపిన వ్యక్తి చిక్కుల్లో పడ్డట్టే. ఇటీవల ఇదే తరహా కేసు సైబర్ క్రైమ్ పోలీసుల వద్దకు వచ్చింది. విషయం తెలియడంతో పోలీసులు వాటిని పంపిన వ్యక్తికి కౌన్సెలింగ్ చేసి వదిలిపెట్టారు.
వాట్సాప్, ఫేస్‌బుక్‌లతో...
సెల్‌ఫోన్లలో వాట్సాప్, ఫేస్‌బుక్, ఇంటర్‌నెట్ అందుబాటులోకి వచ్చాక ఎంత ఉపయోగం ఉందో... అదే స్థాయిలో చేటు జరుగుతోంది. టీనేజర్లకూ తల్లిదండ్రులు హైఎండ్ ఫోన్లు అందిస్తుండటంతో వాటి ద్వారా ఈ అప్లికేషన్లను యాక్సెస్ చేస్తూ పెడదారి పడుతున్నారు. ఒకప్పుడు ఇంట్లోనో, నెట్ కేఫ్‌కో వె ళ్లి కంప్యూటర్ ద్వారా చేయాల్సినవన్నీ చేతిలో ఉన్న ఫోన్‌తో చేసే సౌలభ్యం ఏర్పడింది. ఇదే అపరిపక్వ ప్రేమాయణాలు... అశ్లీలానికి బానిసలు కావడం, సైబర్ వేధింపులకు మూలంగా మారుతోంది. అనేక మంది యువతీ యువకులు ఇంట్లో ఉన్నా గేమ్స్ పేరు చెబుతూ అర్థరాత్రి వరకు చాటింగ్స్ చేస్తున్నారని... ఇవే కొన్నిసార్లు విపరీత ధోరణులకు కారణంగా మారుతున్నాయని సైబర్ క్రైమ్ పోలీసులు అంటున్నారు.
పూర్తి స్థాయిలో 'ట్రూ' కాదు...
ఫోన్ కాంటాక్ట్స్‌లో లేని... కొత్తగా వచ్చే ఫోన్లు ఎవరు చేస్తున్నారో గుర్తించడానికి ఇటీవల అనేక మంది 'ట్రూ కాలర్'యాప్‌ను ఆశ్రయిస్తున్నారు. ఫోన్ వచ్చినప్పుడు వాటిని వినియోగిస్తున్న వారి పేర్లు డిస్‌ప్లే చేయడం దీని ప్రత్యకత. ఈ యాప్‌లో వచ్చే వివరాలు సైతం పూర్తి స్థాయిలో నమ్మదగ్గవి కాదని సీఐడీ సైబర్ క్రైమ్ పోలీసులు వివరిస్తున్నారు. దీన్ని డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో సదరు వ్యక్తి ఏ పేరు నమోదు చేస్తే... అతడు కాల్ చేసిన వారికి అదే పేరు డిస్‌ప్లే అవుతుంది. ఈ చిట్కానూ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని మరువకూడదని సూచిస్తున్నారు.