పైరుకు ప్రాణం
పైరుకు ప్రాణం
Published Sat, Aug 27 2016 9:44 PM | Last Updated on Mon, Oct 1 2018 2:11 PM
* జిల్లాలో విస్తారంగా వర్షాలు
* మెట్ట పంటలకు మేలు
* బొల్లాపల్లిలో 6.50 సెం.మీ వర్షపాతం
కొరిటెపాడు: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల గత మూడు రోజులుగా జిల్లాలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. శనివారం జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ప్రత్తిపాడు నియోజకవర్గంలో శనివారం కురిసిన భారీ వర్షాలకు నక్కవాసు, మేకల వాగు, కొండవాగు, రామవాగులు పొంగి పొర్లుతున్నాయి. ట్రాక్టర్‌లో పొలం పనులకు వెళ్ళి వస్తూ నడింపాలెం గ్రామం వద్ద కొండవాగులో ముగ్గురు మహిళలు కొట్టుకుపోయి గల్లంతయ్యారు. దీంతో ఆగ్రామంలో విషాదం అలుముకుంది. గుంటూరు నుంచి ప్రత్తిపాడు వెళ్ళే దారిలో బొర్రావారిపాలెం వద్ద రామవాగు పొంగిపొర్లతుండటంతో రాకపోకలు స్థంభించాయి. గుంటూరు నగరంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది.
పంటలకు మేలు చేసే వర్షాలు..
మూడు రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాలు మెట్ట పైర్లకు జీవం పోసినట్లయింది. సుమారు నెల రోజులకు పైగా వర్షం కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. పలు ప్రాంతాల్లో పంటలు ఎండిపోయే దశకు చేరుకున్నాయి. ఈ తరుణంలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో రైతుల్లో ఆనందం వెల్లువిరుస్తోంది. ప్రధానంగా బోర్ల క్రింద ఆధారపడి సాగు చేసిన పత్తి, మిరప, వర్షాధారంగా వేసిన మొక్కజొన్న, జొన్న, పెసర, మినుము, కంది తదితర పంటలకు ప్రయోజనం చేకూరనుంది.
బొల్లాపల్లిలో అత్యధికంగా 6.50 సెం.మీ వర్షం...
జిల్లాలో శనివారం ఉదయం వరకు అత్యధికంగా బొల్లాపల్లి మండలంలో 6.50 సెంటీ మీటర్లు వర్షం పడగా, అత్యల్పంగా తాడేపల్లి మండలంలో 0.18 సెం.మీ వర్షపాతం నమోదైంది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు.. అచ్చంపేట 4.76, రొంపిచర్ల 4.62, దుర్గి 3.94, క్రోసూరు 3.70, ఈపూరు 3.32, శావల్యాపురం 3.30, చిలకలూరిపేట 3.26, నకరికల్లు 3.02, పిట్టలవానిపాలెం 2.64, నరసరావుపేట 2.54, పిడుగురాళ్ళ 2.54, నిజాంపట్నం 2.38, ఫిరంగిపురం 2.36, నూజెండ్ల 2.30, సత్తెనపల్లి 2.30, ముప్పాళ్ల 2.14, కాకుమాను 2.10, గుంటూరు 2.00, పొన్నూరు 1.98, వినుకొండ 1.92, బాపట్ల 1.86, రెంటచింతల 1.68, యడ్లపాడు 1.66, నాదెండ్ల 1.66, పెదనందిపాడు 1.54, కర్లపాలెం 1.42, మంగళగిరి 1.38, వెల్ధుర్తి 1.34, మేడికొండూరు 1.32, తుళ్ళూరు 1.22, ప్రత్తిపాడు 1.20, వట్టిచెరుకూరు 1.20, మాచర్ల 1.16, పెదకూరపాడు 1.06, బెల్లంకొండ 0.74, దాచేపల్లి మండలంలో 0.72 సెం.మీ చొప్పున వర్షం పడింది.
Advertisement
Advertisement