నిందితుడు రాజశేఖర్..
బంజారాహిల్స్: నగదు మార్పిడి కేసులో నిందితుడు రాజశేఖర్ అప్పులు తీర్చుకునేందుకే అడ్డదారులు తొక్కినట్లు తెలుస్తోంది. నాలుగేళ్ల క్రితం సినిమాల మీద మోజుతో స్నేహితులతో కలిసి సినిమాను తీసి అప్పులపాలయ్యాడు. వాటిని కట్టేందుకు అక్రమ మార్గాలకు అలవాటు పడ్డాడు.నాంపల్లి ఇన్ స్పెక్టర్‌గా పని చేస్తున్న సమయంలో లంచం తీసుకుంటూ ఏసీబీకీ చిక్కాడు. తిరిగి పోస్టింగ్ దక్కించుకునేందుకు భారీగానే ఖర్చు చేయాల్సి వచ్చింది.
అప్పటి హైదరాబాద్ మంత్రి అండదండలతో ఉద్యోగం దక్కించుకున్నాడు. ఇందుకై చేసిన అప్పులు తడిసి మోపెడవుతుండటంతో ఎలాగైనా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగానే కరెన్సీ మార్పిడిని అవకాశంగా తీసుకున్న తన స్నేహితుడు కాంగ్రెస్ నేత తిరుమలేష్‌నాయడు పక్కా పథకాన్ని రూపొందించాడు. ఈ నెల 1న ఫిలింనగర్‌లోని గెస్ట్‌హౌస్‌లో కొత్త కరెన్సీ మార్పిడి జరుగుతుండగా అక్కడికి వెళ్లిన రాజశేఖర్ రూ.1.20 కోట్లను ఎత్తుకెళ్లాడు.
ఆ మొత్తాన్ని తిరుమలేష్ నాయుడుకు అప్పగించగా, అందులో తన వాటాగా రూ.20 లక్షలు ఇస్తానని తిరుమలేష్ చెప్పడంతో అలిగి వెళ్లిపోయాడు. మరునాడు టప్పాచబుత్ర స్టేషన్లో తన కారును అప్పగించి బయటకు వచ్చాడు. సాయంత్రానికి అతనిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనట్లు తెలుసుకున్న రాజశేఖర్ మొదట విజయవాడకు వెళ్లి అక్కడి నుంచి పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరిగాడు. జూబ్లీహిల్స్ క్రైం ఇన్ స్పెక్టర్ ముత్తు ఆధ్వర్యంలో గాలింపు చేపట్టిన పోలీసులు యానాంలో తన స్నేహితుడి ఇంట్లో తలదాచుకుంటున్న రాజశేఖర్‌ను పట్టుకున్నారు.
అప్పులు తీర్చేందుకే ఈ పని చేసినట్లు అతను అంగీకరించాడు. విజయవాడలో ఒక భార్య, ఆమెకు తెలియకుండా హైదరాబాద్‌లో మరో భార్యను కలిగి ఉన్న రాజశేఖర్ విధినిర్వహణలోనూ నిర్లక్ష్యం వహిస్తుండటంతో సీఎం క్యాంపు కార్యాలయానికి అటాచ్ చేశారు. డబ్బు చోరీ చేసిన రోజు సాయంత్రం 5 గంటలకు డ్యూటీ ముగియాల్సి అవకాశం ఉండగా అరగంట ముందు డ్యూటీ దిగిన అతను నేరుగా ఫిలింనగర్ గెస్ట్‌హౌస్‌కు వెళ్లి భ యపెట్టి డబ్బులతో పరారయ్యాడు. కాగా అతను తీసిన సినిమా ఇంత వరకు విడుదలకు నోచుకోకపోవడం గమనార్హం.