- దూర విద్య డిగ్రీ, పీజీ పరీక్షల్లో రెగ్యులర్ అధ్యాపకులకే విధులు
కొలిక్కి వచ్చిన అబ్జర్వర్ల నియామకం
Published Thu, Sep 1 2016 12:24 AM | Last Updated on Mon, Sep 4 2017 11:44 AM
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని దూరవిద్య డిగ్రీ, పీజీ పరీక్షలు సెప్టెంబర్ 3 నుంచి, పీజీ పరీక్షలు 4 నుంచి జరుగనున్నాయి. ఈ పరీక్షలకు అబ్జర్వర్లుగా విధులు నిర్వర్తించేందుకు విపరీతంగా పోటీ పెరిగింది. పలువురు అబ్జర్వర్లు తాము కోరుకున్న చోటే డ్యూటీ వేయాలని అధికారులను కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై కమిటీ సభ్యులతో చర్చించిన కేయూ వీసీ, ప్రొఫెసర్ సాయన్న ఓ నిర్ణయానికి వచ్చారు. మెుత్తం 91 పరీక్ష కేంద్రాలు కేయూతో పాటు శాతవాహన, మహాత్మాగాంధీ, తెలంగాణ, ఉస్మానియా తదితర విశ్వవిద్యాలయాల పరి ధిలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ఉన్నాయి.
ఆయా యూనివర్సిటీల పరిధిలోని దూరవిద్య డిగ్రీ, పీజీ పరీక్ష కేంద్రాల్లో అక్కడి కళాశాలల రెగ్యులర్ అధ్యాపకులకే అబ్జర్వర్లుగా డ్యూటీలు వేయాలని కేయూ వీసీ ఆర్.సాయన్న పలువురు వీసీలకు ఫోన్ చేసి కోరారు. అందుకు ఆయా వర్సిటీల వీసీలు కూడా అంగీకరించారు. కాగా, ఆదిలాబాద్ జిల్లాలోని పరీక్షా కేంద్రాలకు అబ్జర్వర్ల నియామక బాధ్యతలను కూడా తెలంగాణ వర్సిటీ వీసీకి అప్పగించారు. దీంతో ఎక్కువ శాతం అబ్జర్వర్ల డ్యూటీలు వేసే విషయంలో సమ స్య పరిష్కారమైంది. ఇక కేయూ పరిధిలోని వరంగల్ జిల్లాలో 10, ఖమ్మం జిల్లాలో మూడు పరీక్షా కేంద్రాలున్నాయి. వీటిలోనూ ఈ యూనివర్సిటీలోని రెగ్యులర్ లెక్చరర్లను అబ్జర్వర్లుగా డ్యూటీలు వేయబోతున్నారని సమాచారం. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. పార్ట్ టైం, కాంట్రాక్టు లెక్చరర్లకు డ్యూటీలు వేయకపోవచ్చని భావిస్తున్నారు. పరీక్షలకు రెండు రోజులే మిగిలి ఉండటం గమనార్హం.
Advertisement
Advertisement