తీరని కష్టాలు
– పాక్షికంగా ఏటీఎం, స్వైప్‌మిషన్ల సేవలు
– విత్‌డ్రాలు, డిపాజిట్ల కోసం బారులు తీరుతున్న జనం
- వేధిస్తున్న చిల్లర కొరత
అనంతపురం అగ్రికల్చర్ : పెద్దనోట్ల రద్దు తర్వాత రోజుకో నిబంధన విధిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజూ రూ.4 వేల వరకు నగదు మార్పిడి చేసుకోవచ్చని తొలిరోజు కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయడంతో బ్యాంకుల వద్ద వేలాది మంది బారులుతీరారు. ఆ తర్వాత ఈ పరిమితిని రూ.4,500లకు పెంచింది. అయితే.. గురువారం దాన్ని రూ.2 వేలకు తగ్గించింది. అది కూడా గడువులోపు ఒక్కసారి మాత్రమే మార్పిడి సౌకర్యం కల్పించింది. ఇలా రోజుకో నిబంధన పెడుతుండడంతో ప్రజలు గందరగోళంతో పాటు అవస్థలకూ గురవుతున్నారు.
శనివారం కేవలం సీనియర్ సిటిజన్లకు రూ.2 వేల నగదు మార్పిడికి అవకాశం కల్పించారు. దీంతో చాలామంది రూ.500, రూ.1,000 పాతనోట్ల ను డిపాజిట్ చేయడానికి మొగ్గుచూపిస్తున్నారు. విత్‌డ్రాల కోసం కూడా జనం బారులు తీరారు. 11వ రోజు కూడా ఏటీఎంలు పాక్షికంగానే పనిచేశాయి. రూ.2 వేల నోట్లు పెట్టడంతో కొంత ఊరట కలుగుతున్నా దానికి చిల్లర కొరత వేధిస్తోంది. ఎస్‌బీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాయింట్ ఆఫ్ సేల్స్ (పీవోఎస్) స్వైప్‌మిషన్లు, మొబైల్ ఏటీఎంలు కూడా పాక్షికంగా సేవలందిస్తున్నాయి. అన్ని బ్యాంకుల్లోనూ రూ.20, రూ.50, రూ.100 నోట్ల కొరత ఎక్కువగా ఉంది. బ్యాంకుల వద్ద గంటల తరబడి పడిగాపులు కాస్తుండడంతో వృద్ధులు, మహిళలు, చిన్నారుల పరిస్థితి దారుణంగా తయారైంది. కరెన్సీ చెస్ట్ కలిగి ఉన్న పెద్ద బ్యాంకుల్లో పరిస్థితి కొంత బాగానే ఉన్నా.. మిగతా వాటిలో నగదు కొరత వేధిస్తోంది. ఆయా బ్యాంకుల ఆర్‌ఎంలు, ఏజీఎంలు కరెన్సీ చెస్ట్ కలిగిన బ్యాంకుల వద్ద గంటల తరబడి వేచిచూస్తున్నారు. శనివారం ఎస్‌బీఐ కరెన్సీ చెస్ట్ దగ్గర నగదు తీసుకెళ్లేందుకు వివిధ బ్యాంకులకు చెందిన వాహనాలు పెద్దఎత్తున తరలివచ్చాయి.
స్వైప్ అంటూ హడావుడి
నగదు రహిత లావాదేవీలపై జిల్లా అధికారులు, బ్యాంకర్లు దృష్టి సారించారు. దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల పరిధిలో పెద్దఎత్తున వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాటు చేస్తున్నా.. మెజార్టీ ప్రజలకు కనీస పరిజ్ఞానం లేకపోవడంతో సమస్య ఏర్పడే అవకాశముంది. ప్రతి ఒక్కరికీ క్రెడిట్, డెబిట్ కార్డు ఉండటంతో పాటు వారి ఖాతాల్లో డబ్బు ఉన్నప్పుడే వీటి ద్వారా సేవలు వినియోగించుకోవచ్చు.