
టోల్‌గేట్ల వద్ద నోట్ల సంక్షోభం..
ఉచిత టోల్‌ఫీజు గడువు ముగిసింది.
♦ వాహనదారులతో టోల్‌గేట్ సిబ్బంది వాగ్వాదం
♦ కిలోమీటర్ల మేర జాతీయ రహదారులపై బారులు తీరిన వాహనాలు
అమరావతి: ఉచిత టోల్‌ఫీజు గడువు ముగిసింది. టోల్‌గేట్ల వద్ద చిల్లర కష్టాలు మొదలయ్యాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని టోల్‌గేట్ల వద్ద ఫీజులు వసూలు ప్రారంభించారు. అర్ధరాత్రి వేళ పెద్ద నోట్లకు చిల్లర లేక వాహనదారులు అష్టకష్టాలు పడ్డారు. శనివారం తెల్లవారు జాము నుంచి టోల్‌గేట్ల వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. డిసెంబరు 15వరకు రూ.500 నోటు తీసుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చినా.. టోల్‌గేట్ సిబ్బంది తీసుకునేందుకు నిరాకరించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
మరోవైపు స్వైపింగ్ మిషన్లు పనిచేయలేదు. టోల్‌ఫీజు రూ.200 దాటితేనే స్వైపింగ్‌కు అనుమతిస్తామని టోల్‌గేట్ల వద్ద సిబ్బంది స్పష్టం చేయడంతో కాజ, ఏలూరు సమీపంలో పొట్టిపాడు టోల్‌గేట్ల వద్ద ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. రూ.500 నోటును పాస్ టాగ్ తీసుకుంటే మాత్రమే అనుమతిస్తామని టోల్‌గేట్ల వద్ద సిబ్బంది బోర్డులు పెట్టారు. వాహనదారుడు రూ.2 వేల నోటు ఇస్తే తమ వద్ద చిల్లర లేదని, పాత రూ.500 నోట్లు తీసుకోవాలని సిబ్బంది చెప్పడంతో వాహనదారులు వాగ్వాదానికి దిగారు. పాత నోట్లు పెట్రోలు బంకుల్లో ఎక్కడా తీసుకోవడం లేదని, చివరకు టోల్‌ప్లాజాల్లో కూడా నిరాకరిస్తుంటే మేమెలా తీసుకుంటామని వాహనదారులు ప్రశ్నించారు.
టోల్ చెల్లింపుల్లో గందరగోళంతో జాతీయ రహదారులపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. విజయవాడ-గుంటూరు, విజయవాడ-హైదరాబాద్, అద్దంకి-నార్కట్‌పల్లి, గన్నవరం-ఏలూరు మధ్యలో ఉన్న టోల్‌గేట్లలో బుధవారం సాయంత్రం వరకు భారీ ట్రాఫిక్ కొనసాగింది. విజయవాడ-హైదరాబాద్ మార్గంలో కీసర టోల్‌గేట్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి నుంచే కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ పరిధిలో 40 టోల్‌గేట్లు ఉన్నాయి. గత నెల 9 నుంచి అన్ని టోల్‌ప్లాజాల్లోనూ వసూళ్లు నిలిపేశారు. డిసెంబరు 2 అర్ధరాత్రి వరకు టోల్‌ఫీజు రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే గత 25 రోజుల్నుంచీ నోట్ల కష్టాలు కొనసాగుతూనే ఉండటం, రూ.100 నోట్లు ఎక్కడా లభ్యత లేకపోవడంతో టోల్ ఫీజు చెల్లించేందుకు వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.