
వెలుగులో..చీకటి కోణం..!
♦ అక్రమాలు నిర్ధారణ అయినా చర్యలు శూన్యం
♦ సెర్ఫ్ సీఈఓ వరకు వెళ్లిన కొందరి వ్యవహరం
♦ డీఆర్‌డీఏ ‘వెలుగు’నుశాసిస్తున్న ఆ తొమ్మిది మంది
జిల్లా గ్రామీణాభివృద్ధి (డీఆర్‌డీఏ) సంస్థ ప్రభుత్వ పథకాలను అమలు చేస్తుంది. అందులో వెలుగు విభాగం ఎంతో కీలకం. ఇక్కడదాదాపు 14 పథకాలు అమలవుతాన్నాయి.వీటి రథాలను నడిపే సిబ్బంది కూడాఎక్కువే. చాలా మంది సిబ్బంది నిజాయితీగా పనిచేస్తున్నారు. నిరుపేదలను ఆదుకుంటున్నారు. అయితే డీఆర్‌డీఏనుతొమ్మిది మంది సిబ్బంది తమ గుప్పిట్లోపెట్టుకున్నారు. తమ తెలివితేటలతో బాగానే వెనకేసుకున్నారు. వారు జిల్లాలోఏ ప్రాంతంలో ఉన్నా చక్రం తిప్పుతున్నారని సమాచారం. దీనిపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపితే ఎన్నోవాస్తవాలు ‘వెలుగు’ చూస్తాయని ఆశాఖలోని సిబ్బంది గుసగుసలాడుతున్నారు.
కడప రూరల్:
జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థలోని వెలుగు విభాగంలో ఇన్సూరెన్స్, మార్కెటింగ్, హార్టికల్చర్, జెండర్, లైÐŒ వుడ్, బ్యాంకింగ్, యానాది డెవలప్‌మెంట్, సామాజిక పింఛన్లు. మహిళా స్వయం సహాయక సంఘాలు, జిల్లా సమాఖ్య తదితర 14 విభాగాలు అమలవుతున్నాయి.వీటిని అమలు చేయడంలో డీఆర్‌డీఏ పీడీ, ఏపీడీ, తదితర సిబ్బంది తర్వాత జిల్లా వ్యాప్తంగా ఉన్న ఒక ప్రాజెక్ట్ మేనేజర్, ఆరుగురు జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్లు, 58 మంది అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్లు, 170 మంది కమ్యూనిటీ కో ఆర్డినేటర్లు కీలకంగా పనిచేసేవారు ఉన్నారు. వారి కింద మరి కొందరు పనిచేస్తున్నారు. కీలకమైన సిబ్బందిలో తొమ్మిది మంది ఆ శాఖను శాసిస్తున్నారని సిబ్బంది అనుకుంటున్నారు. సమాచారం మేరకు...
వారికి అనుకూలంగా...!
గడిచిన నాలుగు నెలల క్రితం ఫసల్ బీమా యోజనకు సంబంధించి కొంతమంది సిబ్బంది అవినీతికి పాల్పడ్డారు. వీరిపై సస్పెన్షన్ వేటు కూడా పడింది. దీంతో వారు రెండుమూడు నెలల పాటు ఇంటికే పరిమితమయ్యారు. తర్వాత వారిని ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు అమరావతికి పిలిపించి వివరాలు తీసుకున్నారు. అక్కడ ఏమి జరిగిందో తెలియదు గాని, వారు ప్రస్తుతం జిల్లాలోనే పనిచేస్తున్నారు. నిబంధనల ప్రకారం సస్పెన్షన్‌కు గురైన వారిని వేరే జిల్లాలకు బదిలీ చేయాలి. ఇక్కడ అలా జరగలేదు. అలాగే గడిచిన నెలలో 21వ తేదీన బదిలీలు జరిగాయి.ఇవి కూడా ఆ తొమ్మిది మందికి అనుకూలంగా జరిగాయి.
అంతకుముందు కొన్ని జిల్లాల నుంచి అవినీతి సిబ్బందిని అమరావతికి పిలిపించారు. అందులో భాగంగా ఇక్కడి నుంచి ఒకరు అక్కడికి వెళ్లారు.ఇతని పని తీరు, వచ్చిన అవినీతి ఆరోపణలపై ఆ ఉన్నతాధికారి మండిపడ్డారు. ఇక నీ సేవలు అక్కడ చాలు. వేరే జిల్లాకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. అతను ప్రస్తుతం జిల్లాలోని ఒక నియోజక వర్గంలో పనిచేస్తున్నారు. ఐదేళ్ల క్రితం ఒక విభాగాన్ని తీసేశారు. ఒకరి కోసం పట్టు పట్టి ఆ విభాగం ఎంతో అవసరమని అనుమతి తీసుకొని మళ్లీ ప్రారంభించారు.
తొమ్మిది మందిలో ముగ్గురు కీలకం...
ఆ తొమ్మిది మందిలో ముగ్గురు సిబ్బంది డీఆర్‌డీఏను తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. వారు జిల్లాలో ఎక్కడ ఉన్నా చక్రం తిప్పేస్తారు. ఒకవేళ తమకు వేరే ప్రాంతానికి బదిలీ అయితే, ఆ స్థానంలో తమ అనుచరులను నియమించుకునే స్థాయికి ఎదిగారు.అవకాశం ఉంటే అక్కడే మరో చోట పనిచేసే సిబ్బందిని నియమిస్తారు. ఇక అక్రమార్జనకు కొదవలేదనే ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. నిబంధనల ముసుగులోనే అంతా పద్ధతిలా సాగుతుందని అంటున్నారు.
ఈ విషయాలపై ఉన్నతాధికారులు క్షేత్ర స్థాయిలో సమగ్రంగా దర్యాప్తు జరిపితే మరిన్ని విషయాలు వెలుగు చూస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏది ఏమైనప్పటికీ వస్తున్న ఆరోపణలుపై స్పందించి ‘వెలుగు’లో చీకట్లు ఉంటే పారదోలాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ విషయం గురించి డీఆర్‌డీఏ ఇన్‌చార్జి ప్రాజెక్టు డైరెక్టర్(పీడీ)శివారెడ్డిని వివరణ కోసం సంప్రదించగా ఆయన అందుబాటులోకి రాలేదు.