
దాసరి కోలుకుంటున్నారు...
ఆయన ఆరోగ్యంపై ఆందోళన అక్కర్లేదు: కిమ్స్ ఎండీ
సాక్షి, హైదరాబాద్: తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ప్రముఖ దర్శక నిర్మాత, కేంద్రం మాజీ మంత్రి దాసరి నారాయణరావు ప్రస్తుతం కోలుకుంటున్నారని కిమ్స్ ఎండీ డాక్టర్ భాస్కర్‌రావు వెల్లడించారు. ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గురువారం చెప్పారు. మూడునాలుగు రోజుల్లో సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉందన్నారు. అన్నవాహిక ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతూ నాలుగు రోజుల కిందట దాసరి ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఇన్‌ఫెక్షన్ తొలగిస్తున్న క్రమంలో ఆయన కిడ్నీలు, ఊపిరితిత్తుల పనితీరు దెబ్బతింది. దీంతో వెంటిలేటర్‌తో కృత్రిమ శ్వాస అందించారు. కిడ్నీల పనితీరు మెరుగవ్వడంతో డయాలసిస్ నిలిపివేసి, గురువారం వెంటిలేటర్ తొలగించారు. కానీ దాసరి చికిత్సకు స్పందించలేదు. దీంతో ఆయన్ను మళ్లీ వెంటిలేటర్‌పైకి మార్చి వైద్యం అందిస్తున్నారు.
దత్తాత్రేయ పరామర్శ...
కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ సహా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ మాదిగ, సినీనటులు మురళీమోహన్, తరుణ్, రోజారమణి, ఎడిటర్ మోహన్, కాస్ట్యూమ్స్ సురేష్ తదితరులు ఆస్పత్రికి చేరుకుని దాసరి ఆరోగ్యంపై ఆరా తీశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. దాసరి ఆరోగ్యం కుదుటపడాలని కోరుకుంటూ గురువారం ఫిలింనగర్ సొసైటీ కార్యదర్శి కాజా సూర్యనారాయణ ఫిలింనగర్ దైవ సన్నిధానంలో వేంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేశారు.