
అధికార అండ.. దౌర్జన్యకాండ
- టీడీపీ వర్గీయుల తీరుతో జిల్లాలో భయానక వాతావరణం
- అధికార పార్టీ నేతల అనుచరులుగా గ్యాంగ్‌స్టర్లు, దౌర్జన్యపరులు
- గ్యాంగ్‌స్టర్ మధు వ్యవహారంలో మంత్రి పల్లెపై విమర్శలు
- పరిటాల అనుచరుడిగా నగేశ్ అరాచకం
- అతని దాషీ్టకాలను చూపినందుకు సిటీకేబుల్‌లో ‘సాక్షి’ ప్రసారాల నిలిపివేత
- అరాచక శక్తులపై పోలీసుల ఉదాసీనత : సీపీఐ జగదీశ్
అవినీతి, అరాచకాలతో అధికార పార్టీ నేతలు పేట్రేగిపోతున్నారు. భూదందాలు చేస్తూ ఇటీవల మంత్రి పల్లె రఘునాథరెడ్డి అనుచరుడు మధు తెరపైకి వచ్చిన ఘటన మరవకముందే, మరో మంత్రి పరిటాల సునీత అనుచరుడు నగేశ్ చౌదరి ఆగడాలు చర్చనీయాంశంగా మారాయి. అతను పోలీసుల సమక్షంలోనే ఓ యువకుణ్ని చితకబాది, ఆ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం కలకలం సృష్టిస్తోంది. శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో ప్రభుత్వం, అందులో భాగస్వాములైన మంత్రులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ వారి అనుచరులమంటూ అసాంఘిక శక్తులు అరాచకాలు సృష్టిస్తున్నా పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా వీటిని ఎత్తిచూపుతున్న మీడియా గొంతును కూడా నొక్కేలా వ్యవహరిస్తున్నారు.
శ్రుతిమించిన నగేశ్ చౌదరి వ్యవహారం
నగేశ్‌ది బత్తపల్లి మండలం పత్యాపురం గ్రామం. పరిటాల శ్రీరామ్‌కు గతంలో కారు డ్రైవర్‌గా పనిచేసినట్లు తెలుస్తోంది. తర్వాత శ్రీరామ్‌కు ముఖ్య అనచరుడిగా ఉంటూ, అతని పేరుతో దందాలు చేస్తున్నాడనే విమర్శలున్నాయి. నగేశ్ చౌదరి బర్త్‌డేకు సునీత ఇద్దరు కుమారులు శ్రీరామ్, సిద్దార్థ Ðð ళ్లడంతో ప్రజలు కూడా అతనికి పరిటాల అండదండలు పుష్కలంగా ఉన్నట్లు నమ్ముతున్నారు. నగేశ్‌కు ఈ నెల 16న కుందుర్పి మండలం శీగలపల్లికి చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. పెళ్లిపత్రికల్లో కూడా పరిటాల రవీంద్ర, శ్రీరామ్ దివ్య ఆశీస్సులతో అని ముద్రించుకున్నాడు. అందులో పరిటాల రవి, సునీత, శ్రీరామ్ ఫొటోలను కూడా వేయించాడు. వివాహానికి నసనకోట ఆలయంలో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అలాగే రామగిరి సర్వే నంబర్ 476లో నగేశ్‌కు ప్రభుత్వం ఇంటిస్థలం కేటాయించింది. సునీత సిఫారసుతోనే అధికారులు ఇంటిస్థలం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలన్నీ నగేశ్ పరిటాల వర్గీయుడనే విషయాన్ని స్పష్టీకరిస్తున్నాయి.
బోయ ఓబులేసుపై భౌతికదాడి
తనకు కాబోయే భార్య విషయంలో బోయ ఓబులేసుపై కక్షపెంచుకున్న నగేశ్ ఇటీవల అనంతపురం సమీపంలోని పండమేర వంకలోకి అతన్ని తీసుకెళ్లి చావబాదాడు. అతన్ని కొడుతూ ‘వీడ్ని వెంటనే వెంకటాపురం తీసుకుపోవాలి’ అని ఓ వ్యక్తితో ఫోన్‌లో అన్నాడు. ఘటనాlస్థలికి పోలీసులు కూడా వెళ్లారు. తీవ్ర రక్తస్రావంతో ఓబులేసు చావుకేకలు పెడుతున్నా వారు పట్టించుకోలేదు. ఇదే సమయంలో శ్రీరామ్ సమీప బంధువు రాజన్నకు నగేశ్ ఫోన్‌చేసి.. పోలీసులతో మాట్లాడమని ఇచ్చారు. వారు అతనితో మాట్లాడారు. కానీ దాడిని మాత్రం నివారించలేదు. ఈ ఘటనపై సామాజిక హక్కుల వేదిక నేతలు తీవ్రంగా స్పందించారు. ధర్మవరం మండలం, ఘంటాపురం గ్రామానికి చెందిన నాగప్పను అధికార పార్టీకి చెందిన వారు కిడ్నాప్ చేసి రూ.11 లక్షల అప్పు ఉన్నట్లు బాండ్లు రాయించుకున్నారని, దీనిపై ఎస్పీకి ఫిర్యాదు చేసినా స్పందించలేదని వేదిక అధ్యక్షుడు, సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీశ్ ఆరోపించారు. ఇప్పుడు అణగారిన వర్గానికి చెందిన బోయ ఓబులేసుపై దాడికి దిగడం చూస్తే భవిష్యత్తు పరిణామాలు ఆందోళనకరంగా ఉండబోతున్నాయన్నారు.
‘సాక్షి’ ప్రసారాలు నిలిపివేత
బోయ ఓబులేసును నగేశ్‌చౌదరి చితకబాదడంపై ‘సాక్షి’లో వార్తలు ప్రసారం కావడం, నగేశ్ బర్త్‌డేకు సునీత ఇద్దరు కుమారులు హాజరైన చిత్రాలనూ చూపించడంతో పరిటాల వర్గం ఆత్మరక్షణలో పడింది. అలాగే సిటీకేబుల్‌లో ‘సాక్షి’ ప్రసారాలను ఆదివారం రాత్రి నుంచి నిలిపేశారు. ప్రజాజీవితంలో ఉన్న వారిపై ఆరోపణలు వస్తే వివరణ ఇవ్వాలి కానీ.. మీడియా గొంతు నొక్కేలా ప్రసారాలు ఆపేయడం సరికాదని ప్రజలు, వివిధ సంఘాల ప్రతినిధులు ఖండిస్తున్నారు.