కౌలు రైతు కుదేలు
►గుర్తింపు కార్డుల జారీలో జాప్యం
►నీరుగారుతున్న కౌలు రైతు చట్టం
►పంట రుణాలు అందక అవస్థలు
►వడ్డీ వ్యాపారుల వద్దే అప్పులు
కెరమెరి(ఆసిఫాబాద్): సాగు జీవనాధారంగా చమటోడుస్తున్న కౌలు రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఖరీఫ్ ప్రారంభమై రెండున్నర నెలుల కావస్తున్నా పెట్టుబడులకు అవసరమైన ఆర్థిక సహకారం అందక కౌలు రైతు కుదేలవుతున్నాడు. ఆరేళ్లకిందట భూమిని నమ్ముకున్న కౌలు రైతుల కోసం తీసుకవచ్చిన చట్టాలు క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. వారికి రుణ అర్హత కార్డులను జారీ చేయాల్సి ఉంది. కొత్తవి జారీ చేయక పోగా పాత వాటిని సైతం పునరుద్ధరించడం లేదు. దీంతో కౌలు రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
చట్టం ఇలా చెబుతోంది..
కౌలు రైతు చట్టం 2011 మేరకు భూ యజమానులు అనుమతులు లేకుండానే కౌలు రైతుకు రుణ అర్హత కార్డులు జారీ చేయాలి. తమ సొంత భూముల ద్వారా కౌలు రైతులు రుణాలు తీసుకోవడానికి ఎక్కువ మంది భూయజమానులు నిరాకరిస్తున్నారు. ఇదే ప్రధాన సమస్యగా వారికి రుణాలు అందడం లేదు. ఈ క్రమంలో 2015లో ఇప్పటి ప్రభుత్వం భూయజమాని అనుమతి లేకుండా రుణ అర్హత కార్డులు ఇవ్వొద్దని ఉత్తర్వులు జారీ చేసింది. అసలే భూ యజమానుల అనుమతి లేక రుణాలు పొందలేని వారికి ప్రభుత్వ జీవో కొత్త కష్టాలు తెచ్చిపెట్టింది. కొన్ని చోట్ల భూ యజమానులు అంగీకారం తెలిపినా బ్యాంకులు మాత్రం రుణాలు జారీ చేయడం లేదు. తమ భూములు తాకట్టు పెటి యజమానులు పంటరుణాలు తెచ్చుకోవడం కారణంగా రెండోసారి రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు నిరాకరిస్తున్నాయి. చట్టం ప్రకారం యజమానికి భూమి అభివృద్ధి కింద మరోసారి రుణం అందించే వెసులుబాటు ఉంది. అయితే బ్యాంకర్లు ఈ విషయాలను పరిగణలోకి తీసుకోవడం లేదు.
సమన్వయలోపంతోనే..
అధీకృత సాగుధారులు చట్టం మేరకు రుణ అర్హత కార్డులు జారీ చేసిన రైతుకు ఎలాంటి హామీ లేకుండా రూ.50వేల రుణం ఇవ్వాల్సిన అవకాశం ఉన్నప్పటికీ బ్యాంకులు మాత్రం ముందుకు రావడం లేదు. రెవెన్యూ, వ్యవసాయాధికారులు , బ్యాంకర్ల మధ్య సమన్వయ లోపమే రైతుల పాలిట శాపంగా మారింది. సాగు చేసే అన్నదాతకు ప్రైవేట్ అప్పు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. గుర్తింపు అర్హత కార్డులు ఉన్నవారికి కూడా బ్యాంకర్లు మొండిచెయ్యి చూపుతున్నారనే ఆరోపణలు లేక పోలేదు. బ్యాంకులు రుణాలు ఇవ్వక పోవడంతో వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీతో అప్పులు చేయాల్సి వస్తోంది. కార్డులు అందని కౌలు రైతులు దయనీయ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా రెవెన్యూ అధికారులు గ్రామసభలు ఏర్పాటు చేసి రైతుల అర్జీలను పరిశీలించి రుణ కార్డుల మంజూరు చేయాలని కౌలు రైతులు కోరుతున్నారు.
జిల్లాలో ఇదీ పరిస్థితి..
చట్టం వచ్చినప్పటినుంచి జిల్లాలో 100మంది వద్ద కూడా కౌలు రైతు కార్డులు లేవు. గతంలో కొందరు దరఖాస్తులు చేసుకోగా ఇప్పటికీ వారికి గుర్తింపు కార్డులు అందలేదు. కొన్ని సంవత్సరాలు కావస్తున్నా కౌలు రైతుల గురించి అధికారులు పట్టించుకోక పోవడంతో ప్రభుత్వం తెచ్చిన చట్టం నీరుగారుతోంది. సీజన్ ప్రారంభంలో గ్రామసభలు ఏర్పాటు చేసి వినతులు స్వీకరించాల్సి ఉన్నప్పటికి వాటి గురించి పట్టించుకోలేదు. అయితే జిల్లాలో చాలా మండలాలు ఏజేన్సీలు కావడంతో 1/70 చట్టం అడ్డు రావడంతో అనేక మండలాల్లో దరఖాస్తులు కూడా అందలేదని తెలిసింది. దీంతో గిరిజన ప్రాంతాల్లోని గిరిజనేతర రైతులు పరిస్థితి దీనావస్థకు చేరింది. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు తమకు ప్రయోజనం కలిగించేలా సహకరించాలని వారు కోరుతున్నారు.