ఇక శాఖల వంతు
-
శాఖల విలీనం, కొనసాగింపుపై కసరత్తు షురూ
-
పని విభజన, కొత్త ఉద్యోగుల నియామకం, పాలనా విభాగాలపై ఏర్పాటు
-
నీటిపారుదల, అర్‌అండ్‌బి శాఖలకు జిల్లా హోదాతో అధికారుల ఏర్పాటు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు పూర్తి చేసిన ప్రభుత్వం తాజాగా శాఖల పునర్ వ్యవస్థీకరణపై దృష్టి సారించింది. కొత్త జిల్లాల్లో పరిపాలనా విభాగాలు ఎలా ఉండాలి? యథాతథంగా కొనసాగించాలా? పెద్దగా పనిలేని, ప్రాధాన్యత లేని విభాగాలను విలీనం చేయాలా? కొత్త ఉద్యోగుల నియామకం అవసరమా? ఒకవేళ అవసరమైన పక్షంలో ఏ విభాగాల్లో నియమించాలి? వంటి అంశాలపై క్షుణ్నంగా కసరత్తు చేసి నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం ఆయా అంశాలపై వెంటనే కసరత్తు మెుదలు పెట్టింది. ఒకే రకమైన పనితీరు కలిగిన విభాగాలన్నింటినీ ఒకే గొడుగు కింది తెచ్చి జిల్లాస్థాయిలో ఒకే అధికారిని నియమించే అంశంపై జిల్లా అధికారులు ఇప్పటికే కొంత కసరత్తు చేశారు. సీఎం ఆదేశాల నేపథ్యంలో కసరత్తును మరింత వేగవంతం చేసి రెండ్రోజుల్లో నివేదిక ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. జిల్లాలో ఏయే విభాగాలు ఒకే రకమైన పనితీరును కలిగి ఉన్నాయి? వాటిని ఒకే గొడుగు తీసుకొస్తే కలిగే ప్రయోజనాలేమిటి? అట్లాగే ఏ విభాగానికి ఎక్కువ పని ఉంది? క్షేత్రస్థాయిలో ఉద్యోగుల అవసరం ఎక్కడ ఉంది? ప్రస్తుతమున్న శాఖలను యథావిధిగా కొనసాగిస్తే ఏవిధంగా ఉంటుంది? ఏయే శాఖలను విలీనం చేయవచ్చు? అనే అంశాలపై లోతుగా అధ్యయనం చేస్తున్నారు. జోనల్ వ్యవస్థను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినందున ఆయా పోస్టుల్లో కొనసాగుతున్న అధికారులకు అన్యాయం జరగకుండా ఉండేందుకు ఏం చేయాలి? ఏయే పోస్టుల్లో సర్దుబాటు చేయాలనే అంశంపైనే మంగళవారం నుంచి జిల్లాలోని అన్ని శాఖల విభాగాధిపతులు కసరత్తు చేయనున్నారు. సీఎం ఆదేశాల మేరకు జిల్లా అధికారుల కూర్పులోనూ కొత్త పద్ధతి అవలంబించేందుకు సిద్ధమయ్యారు. ప్రతి శాఖకూ తప్పనిసరిగా జిల్లా అధికారి హోదా కలిగిన సిబ్బందిని నియమించేలా ప్రతిపాదనలు రూపొందించనున్నారు. ప్రస్తుతం నీటిపారుదల, అర్‌అండ్‌బీ వంటి శాఖలకు ఈఈ, ఎస్‌ఈ, సీఈ వంటి అధికారులున్నారు. ఇకపై ఈ శాఖలకు జిల్లా నీటిపారుదల అభివృద్ధి అధికారి, రహదారుల అభివృద్ధి అధికారి హోదాతో ఆయా శాఖల జిల్లా అధిపతులను నియమించేందుకు ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో వారికి ఎలాంటి అధికారాలు బదలాయించాలనే అంశంపై జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు చేయనుంది. ప్రస్తుతం జిల్లాల్లో క్షేత్రస్థాయి సిబ్బంది కంటే పర్యవేక్షించే అధికారులే ఎక్కువగా ఉన్నారనే విమర్శలున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇకపై క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది నియామకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేలా ప్రతిపాదనలు రూపొందించనున్నారు.
టాస్క్‌ఫోర్స్ కమిటీలో కలెక్టర్ ఉన్నట్లా? లేనట్టా?
జిల్లాల పునర్విభజన నేపథ్యంలో పరిపాలనా విభాగాల కూర్పుపై పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్ కమిటీని నియమించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ కమిటీలో సీసీఎల్‌ఏ రేమండ్‌పీటర్, రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు స్మితాసబర్వాల్, శాంతికుమారి, వరంగల్ జిల్లా కలెక్టర్ కరుణతోపాటు మన జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ కూడా సభ్యులుగా ఉంటారని తొలుత సమాచారమిచ్చారు. ఈ మేరకు టీవీ ఛానళ్లలో స్క్రోలింగ్ కూడా వచ్చింది. అయితే సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో మాత్రం నీతూప్రసాద్ పేరు లేదు. ఆమె స్థానంలో మెదక్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ పేరుంది. టాస్క్‌ఫోర్స్ కమిటీలో మరో ఇద్దరు ముగ్గురు సీనియర్ అధికారులను కూడా నియమించుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించడంతో నీతూప్రసాద్‌కు కూడా చోటు కల్పించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.