అతిసార.. మేల్కోరా! | diaria spread in the anantapur district | Sakshi
Sakshi News home page

అతిసార.. మేల్కోరా!

Published Tue, Sep 19 2017 9:57 PM | Last Updated on Fri, Jun 1 2018 8:45 PM

అతిసార.. మేల్కోరా! - Sakshi

అతిసార.. మేల్కోరా!

జిల్లాలో విజృంభిస్తున్న
- నెల రోజుల్లో ముగ్గురు మృతి
- అనంతపురంలోనే ఇద్దరు మృత్యువాత
- వందల సంఖ్యలో బాధితులు
- పీహెచ్‌సీలో అందని వైద్య సేవలు
- మరణాలే లేవంటున్న అధికారులు
- ముందస్తు చర్యలు శూన్యం


అతిసార వ్యాధి విజృంభిస్తోంది. ఇటీవల కురుస్తున్న వర్షాలతో పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. దోమల వ్యాప్తితో పాటు ఈగల బెడద కారణంగా వ్యాధుల తీవ్రత పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యం వీడని పరిస్థితి. కనీసం అవగాహన శిబిరాలు కూడా ఏర్పాటు చేయకపోవడం గమనార్హం.

అనంతపురం మెడికల్‌: జిల్లాలో పల్లెలు.. పట్టణాలు తేడా లేకుండా వ్యాధుల తీవ్రత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు జబ్బుతో మంచం పడుతున్నారు. విష జ్వరాలకు తోడు అతిసార వ్యాధి తీవ్రం కావడం ఆందోళన కలిగిస్తోంది. అనంతపురం సర్వజనాసుపత్రిలోని ఐడీ వార్డులో ఈనెల 5న నగరానికి చెందిన సరోజమ్మ(50) మృతి చెందగా.. గత నెల 8న మిస్సమ్మ కాలనీకి చెందిన శ్రీరాములు, బెళుగుప్ప మండలం ఆవులెన్న గ్రామస్తురాలు హుసేనమ్మ మృత్యువొడి చేరారు. జిల్లా కేంద్రంలోనే ఇలాంటి పరిస్థితి నెలకొన్నా వైద్య ఆరోగ్య శాఖ మేల్కోకపోవడం విమర్శలకు తావిస్తోంది. పైగా కాకి లెక్కలతో కాలం వెల్లదీస్తోంది. అతిసార మరణాలను ఇతరత్రా వ్యాధులతో మరణించినట్లుగా చూపుతున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాలను పక్కనపెడితే జిల్లా కేంద్రంలోనూ బాధితుల సంఖ్య పెరుగుతోంది. నగరంలో ఎటు చూసినా చెత్తాచెదారం దర్శనమిస్తున్నా ప్రజా ప్రతినిధులు మేల్కొంటున్నట్లు దాఖలాల్లేవు.

పీహెచ్‌సీల్లో అందని వైద్యం
అతిసార సోకగానే బాధితులు సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్తున్నారు. అయితే అక్కడ సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం.. రోగి పరిస్థితి ఆందోళనకరంగా లేనప్పటికీ ‘మనకెందుకొచ్చిందిలే’ అని వైద్యులు సీహెచ్‌సీలు, ఏరియా, జిల్లా ఆస్పత్రులకు రెఫర్‌ చేస్తున్నారు. కొందరు ప్రాణభయంతో ప్రైవైట్‌ ఆస్పత్రులకు వెళ్తున్నారు. రోగుల అవసరాన్ని ఆసరాగా చేసుకుంటున్న కొందరు వైద్యులు వారి నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు.  
 
అతిసార లక్షణాలు
వాంతులు, విరేచనాలు(బేదులు), కడుపునొప్పి, దాహం, నోరు ఎండిపోవడం, మూత్ర విసర్జన తగ్గిపోవడం.

అతిసార కారణాలు
కలుషితమైన నీరు తాగడంతో పాటు, ఆహార పదార్థాలు తినడం వల్ల అతిసార సోకుతుంది. నిలువ ఉన్న ఆహార పదార్థాలు తినడం మంచిది కాదు. మంచి నీరు సరఫరా చేసే పైపులు పగిలిపోయి అందులో కలుషిత నీరు కలవడం వల్ల ఈ వ్యాధి ప్రబలే అవకాశం ఉంది. పరిసర, వ్యక్తిగత పరిశుభ్రత లోపించడం కూడా ఓ కారణమే.  

తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
క్లోరిన్‌ కలిపిన నీరు సరఫరా అవుతుందా? లేదా? పరిశీలించాలి. గ్రామాల్లోని వాటర్‌ ట్యాంకుల్లో సరిగ్గా బ్లీచింగ్‌ అవుతోందా తెలుసుకోవాలి. ఒకవేళ ఏదైనా లోపం ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పగిలిన పైపులను మరమ్మతు చేయించుకోవాలి. ఓఆర్‌ఎస్‌ పాకెట్లను నిలువ ఉంచుకోవాలి. ఇంట్లో నీటిని కాచి.. చల్లార్చి తాగే అలవాటు చేసుకోవాలి.

పరిశుభ్రమైన నీరు తాగాలి
అతిసార ప్రబలకుండా వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యం. వంట చేసే ముందు.. భోజనం వడ్డించే సమయంలో.. భోజనం చేసే ముందు.. మల విసర్జనకు వెళ్లి వచ్చిన తర్వాత చేతులను సబ్బుతో కడుక్కోవాలి. ఈగలు వాలకుండా వంట పాత్రలపై మూతపెట్టాలి. ఆహారం వేడిగా ఉన్నప్పుడే తినాలి. ప్రధానంగా మురికినీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త వహించాలి. పరిసరాల్లో చెత్తకుప్పలు ఉండకుండా చూసుకోవాలి.
– డాక్టర్‌ ప్రవీణ్‌దీన్‌కుమార్, చిన్నపిల్లల వైద్యుడు, సర్వజనాస్పత్రి

చర్యలు తీసుకుంటాం
వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. అతిసారపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను అప్రమత్తం చేస్తాం. అతిసారతో అధికారికంగా ఒక్కరూ చనిపోలేదు. ఒకే ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో బాధితులుంటే సీరియస్‌గా పరిగణిస్తాం.
– డాక్టర్‌ వెంకటరమణ, డీఎంహెచ్‌ఓ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement