జూపాడుబంగ్లాలో అతిసారం
-30మందికి పైగా అస్వస్థత
-గ్రామంలో పర్యటించిన జిల్లా వైద్యాధికారిణి మీనాక్షిమహాదేవన్
-తాగునీటి కలుషితంపై ఆరా
జూపాడుబంగ్లా: మండలకేంద్రం జూపాడుబంగ్లాలో అతిసారం ప్రబలింది. కలుషిత తాగునీటి సరఫరాతో గ్రామంలోని నీలిపల్లెపేట, సిద్దేశ్వరంపేట, సంతగేట్‌కాలనీ, కాసానగర్, క్వార్టర్స్ తదితర ప్రాంతాలకు చెందిన 30 మంది సోమవారం ఉదయం వాంతులు, విరేచనలు చేసుకున్నారు. గ్రామంలోని ముస్లిం కాలనీలో ఉండే ఓవర్‌హెడ్ ట్యాంకును సరిగ్గా శుభ్రం చేయకపోవడమే ఈపరిస్థితికి కారణమని గ్రామస్తులు వాపోతున్నారు. దీనికితోడు చాలా రోజులుగా నీలిపల్లెపేట కాలనీలో మురుగునీటి కాల్వలు శుభ్రం చేయడం లేదు. కాలువ గుండా ఉన్న తాగునీటి పైపులు లీకై నీరు కలుషితమై ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఈ కాలనీలో ఐదురోజుల క్రితం ఒకరిద్దరు అతిసారం బారిన పడ్డారు. సోమవారం ఒక్కసారిగా పదుల సంఖ్యలో అస్వస్థతకు గురికావడంతో చికిత్స కోసం వచ్చిన వారితో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి కిటికిటలాడింది. డాక్టర్ రంగారెడ్డి బాధితులకు సెలెన్‌బాటిళ్లు ఎక్కించి ప్రాథమిక చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని మెరుగైన చికిత్సకోసం 108లో నందికొట్కూరుకు తరలించారు. అతిసారం ప్రబలిన విషయం తెలుసుకున్న జిల్లా వైద్యాధికారిణి మీనాక్షిమహాదేవన్ జూపాడుబంగ్లా ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి చేరుకొని బాధితులతో మాట్లాడారు. తర్వాత గ్రామానికెళ్లి సమస్యపై ఆరాతీశారు. తాగునీటి ట్యాంకును శుభ్రం చేయకపోవటంతోనే అతిసారం ప్రబలినట్లు వైద్యాధికారిణి తెలిపారు.
తాగునీటి కలుషితంపై డీఈ ఆరా: గ్రామంలో తాగునీటి కలుషితంతో వాంతులు, విరేచనాలు ప్రబలిన విషయాన్ని తెలుసుకున్న తాగునీటిశాఖ డీఈ రవికుమార్‌రెడ్డి, ఏఈ మహమ్మద్‌హుసేన్, ఈఓపీఆర్డీ మహమ్మద్‌హనీఫ్ ముస్లిం కాలనీలోని తాగునీటి ట్యాంకును పరిశీలించారు. వెంటనే శుభ్రం చేయించారు. ఇదిలా ఉంటే నీటిని పరీక్ష చేయగా తాగునీరు కలుషితం కాలేదని తేలిందని డీఈ చెప్పడం గమనార్హం.