విద్యుదాఘాతం బలిగొంది
Published Thu, Nov 3 2016 12:07 AM | Last Updated on Wed, Apr 3 2019 5:32 PM
మేడపాడు (యలమంచిలి): మేడపాడు పంచాయతీ పరిధిలోని బోడిగరువు వద్ద రొయ్యల చెరువు ఇంజన్‌కు ఉన్న త్రీఫేజ్ విద్యుత్ తీగలు తగలడంతో చెరువు సాగు చేసే ఆక్వా రైతు వంగా మహంకాళి ఉరఫ్ బాబులు (45) అక్కడికక్కడే మరణించాడు. స్థానికుల కథనం ప్రకారం మహంకాళి స్వగ్రామం పాలకొల్లు మండలం ఉల్లంపర్రు. కొన్నేళ్లుగా నరసాపురంలో నివాసం ఉంటున్నాడు. నాలుగేళ్ల క్రితం మేడపాడులో ఐదెకరాలు చెరువులు లీజుకు తీసుకుని రొయ్యలు సాగు చేస్తున్నాడు. రోజూ మాదిరిగానే బుధవారం సాయంత్రం చెరువు వద్దకు వచ్చిన మహంకాళి ఇంజన్‌లో సమస్య తలెత్తడంతో చెరువు వద్ద పనిచేసే కూలీతో ఇంజన్‌లో నీరు పోయిస్తున్నాడు. ఈ క్రమంలో ఇంజన్‌కు వెళ్లిన విద్యుత్ తీగలపై చేయి వేశాడు. తీగకు జాయింట్ ఊడటంతో విద్యుదాఘాతానికి గురై చెరువులో పడిపోయాడు. వెంటనే చెరువుపై ఉండే కూలీలు అతడిని బయటకు తీసుకువచ్చి 108కు సమాచారం అందించారు. వా హనం వచ్చే సరికే మహంకాళి మరణించాడు. మృతునికి భార్య అంజలీదేవి, కుమార్తె యామిని ఉన్నారు. వీఆర్వో పెనుగొండ సూర్యనారాయణ, ఎస్సై పాలవలస అప్పారావు సంఘటనా స్థలానికి చేరుకుని శవపంచనామా నిర్వహించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Advertisement