విద్యుత్ బిల్లుల చెల్లింపు కష్టాలు తొలగిస్తాం
– కొత్త కౌంటర్లు ప్రారంభించిన ఎస్‌ఈ భార్గవ రాముడు
కర్నూలు(రాజ్‌విహార్): విద్యుత్ బిల్లుల చెల్లింపులో వినియోగదారులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటామని విద్యుత్ శాఖ ఏపీ ఎస్‌పీడీసీఎల్ ఆపరేషన్స్ ఎస్‌ఈ జి. భార్గవరాముడు స్పష్టం చేశారు. శనివారం స్థానిక పవర్ హౌస్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన బిల్లుల చెల్లింపు కౌంటర్లను ఆయన ప్రారంభించారు. ఈ సముదాయంలో కర్నూలు టౌన్, రూరల్స్ వియోగదారులకు సంబంధించి 8 కౌంటర్లు నిర్మించారు. ఇందులో ఆన్‌లైన్, స్వైప్ మిషన్, నగదు, డీడీలు, చెక్కుల పద్ధతిలో చెల్లించేందుకు వేరువేరుగా ఈ కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులకు క్యూ కష్టాలు ఉండరాదని అధిక సంఖ్యలో కౌంటర్లు నిర్మించినట్లు వెల్లడించారు. ఇకపై ఉదయం 8–30గంటలకు బిల్లు వసూలు కేంద్రాలు తెరుచుకుంటాయని, మధ్యాహ్నం భోజన విరామంలో కూడా బిల్లులు స్వీకరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సాయంత్ర 4:30గంటల నుంచి రాత్రి 7గంటల వరకు ఆన్‌లైన్, స్వైప్ మిషన్ల ద్వారా మాత్రమే బిల్లులు చెల్లించే సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పాత పెద్ద నోట్లను రద్దు చేయడంతో పాత రూ.500, రూ.1000 నోట్లు తీసుకోవడం లేదని, చెలామణిలో ఉన్న నోట్లను మాత్రమే తీసుకుంటున్నట్లు తెలిపారు. చెక్కులు, డీడీలు లేక ఆన్‌లైన్, ఏటీపీ మిషన్ల ద్వారా బిల్లులు చెల్లించవచ్చని సూచించారు. నగదు రహిత లావాదేవీలు జరిపేందుకు పీఓఎస్ (పాయింట్ ఆఫ్ సేల్)ను ప్రొత్సహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఈ రమేష్, ఎస్‌ఏఓ మత్రూనాయక్, ఏడీఈలు ప్రసాద్, రంగస్వామి, శేషాద్రి, ఏఓలు విన్సెంట్, మల్లికార్జున, ఈఆర్‌ఓల సిబ్బంది పాల్గొన్నారు.