ప్చ్.. తప్పుచేశాం..!
‘రాజధాని’ రైతుల్లో అంతర్మథనం
సగానికి పడిపోయిన భూ సమీకరణ లక్ష్యం
పరిహారం తీసుకోని రైతుల భూమి విస్తీర్ణం 4,430 ఎకరాలు
కోర్టు వివాదాల్లో ఐదు వేల ఎకరాలు
సీఎం ఆర్భాటపు ప్రకటనలకు భిన్నంగా పరిస్థితులు
వైఖరి మారకుంటే సహాయనిరాకరణ చేస్తామంటున్న రైతులు
రాజధాని రైతులు అంతర్మథనంలో పడుతున్నారు.. భూములిచ్చి తప్పుచేశామన్న భావనకు వస్తున్నారు.. సీఎం తమకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం.. తమ ప్రయోజనాలకు భంగం కలిగించే నిర్ణయాలు తీసుకోవడమే ఇందుకు కారణం. భూములిస్తూ అంగీకార పత్రాలు ఇచ్చిన కొందరు రైతులు నష్టపరిహారం తీసుకునేందుకు వెనుకాడుతున్నారు.. మరికొందరు భూ సమీకరణ, రోడ్ గ్రిడ్, మాస్టర్ ప్లాన్ నిబంధనలకు వ్యతిరేకంగా న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు.
గుంటూరు : రాజధానికి భూములిచ్చిన రైతుల సంఖ్య, భూమి విస్తీర్ణం సీఎం ప్రకటనలకు భిన్నంగా ఉంది. ‘నాపై నమ్మకం ఉంచి రాజధాని నిర్మాణానికి రైతులు 33 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారు.. ఒక పిలుపునకు స్పందించి రైతులు కోట్లాది రూపాయల విలువ చేసే భూములు తృణప్రాయంగా ఇవ్వడం ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేదు..’ అని ప్రతి కార్యక్రమం, సభల్లోనూ సీఎం గొప్పలు చెప్పుకొంటున్నా క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అలా లేవు. మొత్తం 47 వేల ఎకరాలను సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఇప్పటి వరకూ 21 వేల ఎకరాలకు మాత్రమే రైతులు పూర్తిగా అగ్రిమెంట్లు ఇచ్చి నష్టపరిహారం పొందారు.
లాబీయింగ్‌లతోనే...
రాజధానిగా ప్రకటించిన తుళ్లూరు, మంగళగిరి మండలాల్లోని 29 గ్రామాల్లో 36 వేల ఎకరాల పట్టా భూములు, 11వేల ఎకరాలు అసైన్డ్, లంక, చెరువు, పోరంబోకు, ప్రభుత్వ భూములను సమీకరించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. మంత్రులు, అధికార పార్టీ నేతలు ఆశలు కల్పించటం, తమ ప్రభుత్వానికి అండగా ఉండాలనే ఒక సామాజికవర్గం పట్టుదలతో తుళ్లూరు మండలంలోని రైతులు మొదట్లో భూసమీకరణను ప్రోత్సహించారు. మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో భూ సమీకరణకు వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. రంగంలోకి దిగిన మంత్రులు, అధికార పార్టీ నేతలు సామాజిక వర్గాలు, పార్టీ నేతలకు పదవుల ఎర, లాబీయింగ్‌లతో కొన్ని గ్రామాల్లో సమీకరణ చేయగలిగారు.
భయపెట్టినా భంగపాటు..
భూ సమీకరణకు వ్యతిరేకంగా ఉన్న గ్రామాలు, వైఎస్సార్ సీపీకి బలంగా ఉన్న గ్రామాల్లో సమీకరణకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే ఆళ్ల రామక ృష్ణారెడ్డి పోరాటం ప్రారంభించారు. దీంతో ఆందోళన చెందిన ప్రభుత్వ పెద్దలు ఆయా గ్రామాలపై ప్రత్యేక ద ృష్టి సారించి రాత్రి వేళల్లో వ్యవసాయ పరికరాలు తగులబెట్టించడంతో పాటు కొందరిపై కేసులు బనాయించారు.
చివరకు భూసేకరణ తంత్రాన్ని ప్రయోగిస్తామని ప్రకటనలు చేయడంతో కొందరు రైతులు భయపడి అంగీకార పత్రాలిచ్చారు. భూ సమీకరణను విజయవంతంగా పూర్తి చేశామని ప్రభుత్వం సీఆర్‌డీఏ అధికారులు చెబుతున్నా ఇంకా 29 గ్రామాల్లో ఇప్పటికీ 11,569 ఎకరాలు సమీకరించాల్సి ఉంది. మరో 5200 ఎకరాలపై రైతులు కోర్టును ఆశ్రయించారు. ఇక అసైన్‌డ, లంక భూములు 4300 ఎకరాలు వివాదాల్లో ఉన్నాయి.
అవును.. తప్పు చేశాం
రైతుల అభిప్రాయాలకు భిన్నంగా సీఎం ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాజధాని గ్రామాల్లో పెద్ద దుమారాన్నే రేపాయి. టీడీపీకి మద్దతుగా నిలిచిన తుళ్లూరు మండల రైతులు కూడా ఇప్పుడిప్పుడే వాస్తవాలు తెలుసుకుంటున్నారు. తప్పు చేశామనే భావనకు వస్తున్నారు. సీఎం వైఖరిలో మార్పు రాకపోతే రాజధాని నిర్మాణానికి సహకరించేది లేదని వారు స్పష్టం చేస్తున్నారు.
మాస్టర్ ప్లాన్ మాయ..
సింగపూర్ సంస్థలు రూపొందించిన మాస్టర్ ప్లాన్‌లోని మాయను ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్న రైతులు, బిల్డర్లు , గ్రీన్ బెల్ట్ పరిధిలోని రైతులు ఆ ప్లాన్‌ను మార్చాల్సిందేనంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వానికి మద్దతుగా ఉంటున్న బిల్డర్లు రాజధాని పరిధిలోని పక్కా భవనాలు, అపార్టుమెంట్ల నిర్మాణాలకు మాస్టర్ ప్లాన్‌లోని నిబంధనలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు.
స్థలం విస్తీర్ణాన్ని బట్టి సెట్‌బ్యాక్‌లకు ఎక్కువ స్థలాన్ని కేటాయించాలని ఆ నిబంధనలు వివరిస్తున్నాయి. ఇలా నిర్మిస్తే అపార్టుమెంట్ల ధరలు సామాన్యులకు అందని రీతిలో ఉంటాయని బిల్డర్లు చెబుతున్నారు. రోడ్‌గ్రిడ్ ఏర్పాటుతో గ్రామాలు పూర్తిగా కనుమరగయ్యే ప్రమాదం ఉండటంతో వాటి నిర్మాణం అవసరం లేదని రైతులు చెబుతున్నారు.