ఎన్‌సీసీతో క్రమశిక్షణ
- కర్నూలు రేంజ్ డీఐజీ రమణకుమార్
కర్నూలు(హాస్పిటల్): ఎన్‌సీసీలో చేరితే క్రమశిక్షణ గల జీవితం అలవడుతుందని కర్నూలు రేంజ్ డీఐజీ రమణకుమార్ అన్నారు. ఆదివారం స్థానిక బి.క్యాంపులోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల మైదానంలో 68వ ఎన్‌సీసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్‌సీసీ కేడెట్లు డ్రిల్, పెరేడ్ చేశారు. అనంతరం టీజీ వెంకటేష్ కళ్యాణమండపంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డీఐజి మాట్లాడుతూ.. తాను కూడా విద్యార్థి దశలో ఎన్‌సీసీ కేడెట్‌గా ఉన్నానని గుర్తు చేశారు. ఎన్‌సీసీలో చేరడం వల్ల వ్యక్తిత్వం ఇనుమడిస్తుందని, భావవ్యక్తీకరణ, పర్సనాలిటి డెవలప్‌మెంట్, నాయకత్వ లక్షణాలు అలవడతాయన్నారు. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్‌సీసీ ఆధ్వర్యంలో నిర్వహించే సామాజిక కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ఓర్వకల్లు వద్ద ఎన్‌సీసీ క్యాంపు కోసం 20 ఎకరాల కోసం తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లా జాయింట్ కలెక్టర్ సి. హరికిరణ్ మాట్లాడుతూ.. తాను చదువుకునే రోజుల్లో ఎన్‌సీసీ కేడెట్‌గా ఉన్నానని తెలిపారు. ఏ ఆపద, అవసరం వచ్చినా ఎన్‌సీసీ కేడెట్లు ముందుండి సేవ చేస్తారని కొనియాడారు. ప్రతి విద్యార్థి ఎన్‌సీసీలో చేరాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో కర్నూలు గ్రూప్ ఎన్‌సీసీ కమాండర్ కల్నల్ పీజీ కృష్ణ, లెఫ్ట్‌నెంట్ కల్నల్ గౌస్‌బేగ్, సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ రాచయ్య, ఎస్‌టిబిసి కళాశాల ప్రిన్సిపల్ మనోరమ తదితరులు పాల్గొన్నారు.