బెడిసికొట్టిన చర్చలు
బెడిసికొట్టిన చర్చలు
Published Sat, Feb 4 2017 10:28 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
చింతలపూడి ఎత్తిపోతలకు భూములిచ్చే విషయంలో ప్రతిష్టంభన
కాలువ పనులను జరగనిస్తే పరిహారం పెంపుకోసం పోరాడతానన్న కలెక్టర్
ససేమిరా అన్న రైతులు
కలెక్టర్ వ్యాఖ్యలపై ఆగ్రహం
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
చింతలపూడి ఎత్తిపోతల పథకానికి అవసరమైన భూములిచ్చే విషయమై రైతులతో కలెక్టరేట్‌లో శనివారం జరిపిన చర్చలు బెడిసికొట్టాయి. ముందు కాలువ పనులు జరగనివ్వాలని, ఆ తర్వాత రైతులు కోరుతున్న విధంగా నష్టపరిహారం పెంచే విషయమై తాను కూడా ప్రభుత్వంతో పోరాడతానని జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ రైతలను కోరారు. కొత్త భూసేకరణ చట్టం ప్రకారం ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు తాము పనిచేయగలుగుతామే తప్ప ఏ రైతుకూ తక్కువ సొమ్ము ఇవ్వాలనే ఆలోచన ఉండదన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం భూసేకరణ అధికారిగా ప్రభుత్వం స్పెషల్ కలెక్టర్ భానుప్రసాద్‌ను నియమించిందని, రైతులకు పరిహారం ఇచ్చే ప్రతి అధికారం అతనికే ఉంటాయని చెప్పారు. భూసేకరణకు అడ్డుపడుతున్న రైతుల అభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకుని ప్రభుత్వానికి అదనపు సహాయం కోసం సిఫార్సు చేసే అధికారం కూడా ఆయనకే ఉందన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి సహకారం అందిస్తే ప్రభుత్వ పరిధిలో తాను గట్టిగా మాట్లాడి రైతులకు అదనపు సహాయం అందేలా కృషి చేస్తానని చెప్పారు. భూముల మార్కెట్ ధరపై నాలుగు రెట్లు అదనంగా నష్టపరిహారం అడగటం తప్పుకాదని.. తాము చట్టానికి లోబడి సహాయం చేయగలమే తప్ప చేయికోసుకోలేమన్నారు. ఈ విషయాన్ని రైతులు అర్థం చేసుకుని చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి ముందుకు రావాలన్నారు. రైతుల అభిప్రాయాలకు అనుగుణంగా గ్రామాల వారీగా భూములు కోల్పోయే రైతులతో త్వరలోనే సమావేశాలు నిర్వహించి ఏ మేరకు అదనపు సహాయం కావాలనే విషయమై స్పెషల్ కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తారన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి ప్రాంతాలను బట్టి రైతులకు పరిహారం ఇచ్చామని.. కొన్ని గ్రామాల్లో ఎకరానికి రూ.90 వేలు, కొన్నిచోట్ల రూ.32 లక్షలు ధర పలికిందన్నారు. రైతు సంఘ నాయకుడు రంగారావు మాట్లాడుతూ భూములు కోల్పోయే రైతులకు ఎన్నో ఆశలు ఉన్నాయని, వారి భవిష్యత్ జీవితం దెబ్బతింటున్న దృష్ట్యా భూములకు నాలుగు రెట్లు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరారు. అదనపు సహాయం ఏ మేరకు లభిస్తుందో ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి తాము సహకారం అందిస్తామని అన్నారు. పలు ప్రాంతాలలో పలు రకాల సమస్యలు ఉన్నప్పటికీ తామంతా ఏకతాటిపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని మంత్రులు ఇచ్చిన హామీ అమలు చేయాలని చిన్నంశెట్టి చినబాబు కోరారు. భూములకు స్పష్టమైన ధరలు ఇచ్చిన తర్వాతే పనులు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయకుండా పనులు చేయడానికి ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. సమావేశంలో పోలవరం ప్రాజెక్ట్ ఎస్‌ఈ శ్రీనివాసయాదవ్, భూసేకరణ అధికారులు ఆర్‌వీ సూర్యనారాయణ, డి.పుష్పమణి, ఆర్‌డీజీ జి.చక్రధరరావు, రైతు నాయకులు అంజిబాబు, రఘునాధరెడ్డి, శ్రీనివాసరావు పాల్గొన్నారు.
కలెక్టర్ వ్యాఖ్యలపై ఆగ్రహం
’మోసం చేయడం అనేది భారతీయుల జీన్స్‌లోనే ఉంది. ఎప్పుడూ మోసం చేయాలనే ఆలోచిస్తుంటాం. ప్రభుత్వానికి పన్ను కట్టాల్సి వస్తుందని తక్కువ మొత్తానికి కొన్నట్టు రిజిస్ట్రేషన్లు చేయించడం వల్లే ఇబ్బందులు వస్తున్నాయి’ అని కలెక్టర్ భాస్కర్ చేసిన వ్యాఖ్యలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు పక్కన ఉన్న ఇళ్లకు, పొలాలకు గరిష్ట ధర నిర్ణయించాలని రైతులు కోరగా.. కమిటీ వేయడం సాధ్యం కాదని, అధికారులతో కమిటీ వేస్తే వారు అక్రమాలకు పాల్పడతారని సమాధానం ఇవ్వడంపై రైతు ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతులు, అధికారులను నమ్మకుండా ఎవరిని నమ్ముతారని ప్రశ్నించారు.
Advertisement
Advertisement