రొయ్యకు రోగం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: గతనెలలో వచ్చిన వరదలు ఆక్వా రంగానికి తీవ్ర నష్టాలను మిగిల్చాయి. మిగిలిన రొయ్యల సాగును ప్రస్తుతం వ్యాధులు వెంటాడుతున్నాయి. అంతుబట్టని వ్యాధులతో రొయ్య పిల్లలు చనిపోతుండటం, పెరుగుదల లేకపోవటం చూసి ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు. వాతావరణంలో వస్తున్న మార్పులు, తల్లి రొయ్యల ద్వారా సోకుతున్న వ్యాధులపై అధికారులు రైతులకు అవగాహన కల్పించడం లేదు. దీంతో రొయ్యకు వచ్చిన రోగం ఒకటైతే.. రైతులు వైరస్ అంటూ రూ. లక్షలు వెచ్చించి తీవ్రంగా నష్టపోతున్నారు.
రాష్ట్రంలో నెల్లూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఆక్వా కల్చర్ సాగవుతుంది. అత్యధికంగా వెనామీ నెల్లూరు జిల్లాలోనే ఉంది. సముద్ర తీరాన 54 వేల ఎకరాల్లో రైతులు రొయ్యల సాగు చే పట్టారు. అయితే నవంబర్‌లో కురిసిన భారీవర్షాలకు సుమారు 30 వేల ఎకరాల్లో రొయ్యల గుంతలు వరదలకు కొట్టుకుపోయాయి. పంట చేతికొచ్చే సమయంలో విపత్తు సంభవించ డంతో ఆక్వారైతులు రూ. కోట్లు నష్టపోయారు. వరదలకు ముందు ‘వైట్‌గట్’ వైరస్ కారణంగా కూడా నష్టపోయారు.
తల్లి రొయ్య నుంచే ఈహెచ్‌పీ వ్యాధి
రొయ్యకు సోకిన ఎంటిరో సైటోజోన్ హెపిటోప్ పెయినీ (ఈహెచ్‌పీ) వ్యాధి తల్లి రొయ్య నుంచే సోకిందని శాస్త్రవేత్తలు, అధికారులు చెబుతున్నారు. ఆక్వాసాగుకు సంబంధించి గుర్తింపుపొందిన కంపెనీ నుంచే హెచరీలు తల్లిరొయ్యలను కొనుగోలు చేయాల్సి ఉంది. కానీ కొన్ని హెచరీల వారు స్థానికంగా తక్కువ ధరకు దొరికే తల్లిరొయ్యల వైపు మొగ్గుచూపుతున్నారు. తద్వారా ఏహెచ్‌పీ, ఈహెచ్‌పీ వ్యాధులు సోకుతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈహెచ్‌పీ వ్యాధి సోకిన రొయ్యపిల్ల ఎదుగూ బొదుగూ లేకుండా ఉండిపోతుంది. ఆహారం తీసుకుంటుంది కానీ పెరుగుదల కనిపించదు. అయితే చనిపోయినట్లు కనిపిస్తూ కదలకుండా ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న పరిశోధనలు ప్రారంభ దశలోనే ఉన్నాయి. మరో నాలుగేళ్ల తర్వాత మందు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ లోపు రైతులు యాజమాన్య పద్ధతుల ద్వారా వ్యాధి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చూచిస్తున్నారు.
- కోస్టల్ అథారిటీ గుర్తింపు పొందిన సంస్థల నుంచే హేచరీలు తల్లి రొయ్యలను కొనుగోలు చేయాలి.
- రొయ్యల గుంట చుట్టూ వల ఏర్పాటు చేయాలి (వేరొకచోట నుంచి చేపపిల్లలు, ఇతరత్రా వాటిని తెచ్చి గుంతల్లో పడేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
- ఎకరం గుంతలో లక్ష పిల్లలను మాత్రమే వేయాలి.
రెండు నెలలైనా రొయ్యలు పెరగలేదు
రెండు నెలల క్రితం గుంతలో రొయ్య పిల్లలు పోశా ను. ఇప్పటికి దాదాపుగా 12 గ్రాముల వరకు పెరగాల్సి ఉంది. కానీ నాలుగు, ఐదు గ్రాముల బరువు మాత్రమే పెరి గాయి. పిల్లల్లో తేడా.. లేదా ఇంకేమైనా వ్యాధా అనేది తెలియడం లేదు.
- శ్రీహరికోట వెంకటేశ్వర్లు(మైపాడు)
వైరస్‌తో తీవ్రంగా నష్టపోయాం
స్నేహితులం భాగస్వాములుగా చేరి పది ఎకరాల వరకు వెనామీ సాగు చేశాం. రెండు నెలలు అయిన రొయ్య ఎదుగదల లేదు. వర్షాలు ఆగిపోయిన తర్వాత వైరస్ సోకి రొయ్యలు చనిపోయాయి. ఈ వైరస్‌తో తీవ్రంగా నష్టపోయాం.
- ఎస్కే రఫి (గంగపట్నం)