
ఆధిపత్యం వర్సెస్ ఆత్మగౌరవం
సాలూరు తెలుగుదేశం పార్టీలో మరో వర్గపోరు పురుడుపోసుకుంది.
సాలూరు టీడీపీలో మరో వర్గపోరు
నాయకులతో సఖ్యత నెరపని ఎమ్మెల్సీ సంధ్యారాణి
మొన్న భంజ్‌దేవ్‌తో నేడు చైర్‌పర్సన్ విజయకుమారితో విభేదాలు
సాలూరు : సాలూరు తెలుగుదేశం పార్టీలో మరో వర్గపోరు పురుడుపోసుకుంది. మాజీ ఎమ్మెల్యే ఆర్‌పీ భంజ్‌దేవ్‌కు ఎమ్మెల్సీ సంధ్యారాణి నడుమ విభేదాలున్న సంగతి తెలిసిందే. ఇది చాలదన్నట్లు ప్రస్తుతం ఎమ్మెల్సీ, మున్సిపల్ చైరపర్సన్ మధ్య కూడా విభేదాలు చోటుచేసుకున్నాయి. దీంతో చోటామోటా నాయకులు, కార్యకర్తలు ఎవరి వెంట నడవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. వీరిమధ్య జరుగుతున్న అంతర్యుద్ధాన్ని ఆత్మగౌరవానికి, ఆధిపత్యానికి మధ్య జరుగుతున్న పోరుగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
సొంత కష్టంతో అధికారంలోకి..
గుమ్మిడి సంధ్యారాణి పార్లమెంట్ ఎన్నికల్లో, భంజ్‌దేవ్ శాసనసభ ఎన్నికల్లో ఓటమి చవిచూడగా సాలూరు మున్సిపాలిటీలో టీడీపీ పతాకం ఎగరడానికి గొర్లె విజయకుమారి, ఆమె భర్త మాధవరావు కృషేనని చెప్పక తప్పదు. ఇదిలా ఉంటే మున్సిపల్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన విజయకుమారి తనదైన శైలిలో పాలన సాగిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే సంధ్యారాణికి ఎమ్మెల్సీ పదవి వరించిన అనంతరం పరిస్థితిలో పూర్తి మార్పు వచ్చింది. ప్రతి చిన్న పనికీ ఆమె వచ్చి శంకుస్థాపనలు చేయడం, సమావేశాలు నిర్వహించడం వంటివి చేస్తూ తమను ఓవర్‌టేక్ చేస్తున్నారని విజయకుమారి వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సొంతపార్టీలోనే ఆధిపత్యం చెలారుుస్తూ తమను తొక్కేయాలని భావించడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. అంతేగాకుండా పార్టీ ఇన్‌చార్జి భంజ్‌దేవ్ వెంట నడవకూడదని ఆదేశిస్తున్నారని, ఇలా అయితే ఎలా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల సాలూరు రైల్‌బస్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తనకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని చైర్‌పర్సన్ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే రాజకీయ ఒడిదుడుకులు ఉండకూడదనే ఉద్దేశంతోనే సంధ్యారాణి వెంట చైర్‌పర్సన్ విజయకుమారి, భంజ్‌దేవ్ వెంట ఆమె భర్త మాధవరావు తిరుగుతున్నా వేధింపు లు తప్పడం లేదని తెలుస్తోంది.
ఇటీవల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఆక్రమిత స్థలాల్లో షాపులను కూలగొట్టడాన్ని ఎమ్మెల్సీ తప్పుబట్టారు. దీన్ని చైర్‌పర్సన్ వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. కౌన్సిల్ నిర్ణయం మేరకు తీసుకున్న నిర్ణయూన్ని ఎమ్మెల్సీ ఎలా తప్పుబడతారని ప్రశ్నిస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకానికి సంబంధించి ఎమ్మెల్సీ, చైర్‌పర్సన్‌లు వేర్వేరుగా గురువారం శంకుస్థాపనలు చేపట్టారంటే వీరి మధ్య విభేదాలు ఏ స్థారుులో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. వీరి తీరు పట్ల సొంత పార్టీలోనే అసంతృప్తి సెగలు వినిపిస్తున్నాయి. అయితే సంధ్యారాణి సహకారంతోనే రాజకీయూల్లోకి వచ్చిన విజయకుమారి ఆమెతోనే వైరం నడపడాన్ని ఎమ్మెల్సీ వర్గీయులు తప్పుబడుతున్నారు. ఏది ఏమైనా అధికారపార్టీలో ఉన్నామన్న మాటేగానీ నాయకుల మధ్య ఆధిపత్యపోరులో తాము నలిగిపోతున్నామని కార్యకర్తలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి ఎలా ఉంటుందో వేచి చూడాలి.