ఈ ‘దాహం’ తీరనిది! | district wide water problem | Sakshi
Sakshi News home page

ఈ ‘దాహం’ తీరనిది!

Published Tue, Jun 13 2017 10:08 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

ఈ ‘దాహం’ తీరనిది! - Sakshi

ఈ ‘దాహం’ తీరనిది!

– ఈ ఏడాది రూ.124 కోట్లు నిధులు
– నేటికి 679 గ్రామాలకు చేరని తాగునీరు
– 162 గ్రామాలకు ట్యాంకర్లతో నీటి సరఫరా
- నిధుల స్వాహాకే పెద్దపీట


ప్రజల దాహాన్ని తీరుస్తాన్నమంటూ నిధుల స్వాహాకే నాయకులు పెద్ద పీట వేశారు. రూ. కోట్లు ఖర్చు పెట్టి ప్రవేశపెట్టిన పథకాలు జిల్లా ప్రజల దాహార్తిని తీర్చలేకపోతున్నాయి. తరాలు మారినా ‘అనంత’ గొంతు తడిపిన వారు లేరు.... నేతల ధన దాహమూ తీరలేదు.  
- అనంతపురం సిటీ

గుక్కెడు నీటి కోసం జిల్లాలో కిలోమీటర్ల దూరం జనం పరుగులు తీయాల్సివస్తోంది. పలుమార్లు మహిళలు రోడ్లెక్కి ధర్నాలు, నిరసనలు తెలిపినా.. పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రాలేదు. బిందెడు నీటి కోసం రోజు కూలి పనులు వదుకునే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితిల నుంచి ప్రజలను గట్టెక్కించాల్సిన ప్రభుత్వం.. ప్రత్యామ్నాయ చర్యలను పక్కనబెట్టి అధికారులపై జులుం చేస్తూ భయపెడుతోంది. వాస్తవానికి సమస్య తీవ్రతను ఎత్తి చూపి, నిధులు రాబట్టుకోవడం.. దానిని క్షేత్రస్థాయిలో సక్రమంగా వినియోగించకుండా సొంత ఖజనాలకు తరలించుకోవడం ఆనవాయితీగా మారింది. ఫలితంగా ప్రతి ఏటా తాగునీటి సమస్య ఉత్పన్నమవుతూ ఉంది.

నిధుల వరద ఇలా..
– ఈ ఏడాది జిల్లాలోని పలు గ్రామాల్లో ట్యాంకర్లతో నీటిని సరఫరా చేసేందుకు బకాయిలతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేసింది.
- ఇవి కాక కలెక్టర్‌ ప్రత్యేక ప్యాకేజీ కింద రూ. 58 కోట్లు ఖర్చయ్యాయి.
– తాజాగా మరో రూ.40 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మొత్తంతో శింగనమల పరిధిలోని 25 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేసేలా పథకానికి రూపకల్పన చేశారు.
– శ్రీరామరెడ్డి తాగునీటి ప్రధాన పైప్‌లైన్‌ పనులకు రూ.32 కోట్లు మంజూరు కాగా, ప్రస్తుతం ఆ పనులు జరుగుతూ ఉన్నాయి.
– చేతి పంపులు, బోర్ల మరమ్మతులు తదితర పనులకు రూ.4 కోట్లు మంజూరయ్యాయి.
– శ్రీరామరెడ్డి తాగునీటి పథకంలో పని చేసే సిబ్బంది వేతనాలు, ఇతర బత్యాలకు గాను ఏడాదికి రూ.23 కోట్లను ప్రభుత్వం ఇస్తోంది. ఇవి కాకుండా పలు పథకాల కింద మరిన్ని నిధులు మంజూరయ్యాయి.

స్కీమ్‌లన్నీ స్కామ్‌లే
జిల్లాలో తాగునీటి కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేసింది. అయితే ఆ పథకాలన్నీ చోటా నేతల జేబులు నింపుకునేందుకే సరిపోయాయన్న ఆరోపణలున్నాయి. జిల్లాలో 56 తాగునీటి రక్షిత పథకాలు అమలులో ఉన్నాయి. పది సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకులున్నాయి. 1.05 టీఎంసీల తాగునీటిని రోజుకు సరఫరా చేస్తున్నట్లు ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు చెబుతున్నారు. ఇన్నీ ఉన్నా..  సగటున ఒక మనిషికి రోజుకు 30 లీటర్లకు మించి నీరు అందించలేని పరిస్థితులు నెలకొన్నాయి. 63 మండలాల్లోని 2,379 గ్రామాలకు ఈ 56 తాగునీటి పథకాల ద్వారా నీటిని సరఫరా చేసేలా ప్రభుత్వం డిజైన్‌ చేసింది. ఇందులో 1,795 గ్రామాలకు మాత్రమే నీరు సరఫరా అవుతోంది. మిగిలిన 679 గ్రామాలకు తాగునీటి పథకాలు చేరలేదు. జిల్లాలోనే అతిపెద్ద తాగునీటి పథకంగా ఉన్న శ్రీరామరెడ్డి పథకం ద్వారా  936 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేయాల్సి ఉంది. అయితే 836 గ్రామాలకు మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రధాన పైప్‌లైన్‌ పనులు నాసిరకంగా ఉండడం.. ముందస్తు ప్రణాళిక లేకుండా వేసవిలో పైప్‌లైన్‌ పనులు చేపట్టడం కారణంగా ఈ పథకం ద్వారా ఆశించిన ఫలితాలు దక్కడం లేదు. ఫలితంగా 400ల పైచీలుకు గ్రామాలకు తాగునీటి సరఫరాలో తీవ్ర అంతరాయం చోటు చేసుకుంది. పైగా ఒకే కంపెనీ కింద ఉన్న నిర్వహణ బాధ్యతను ఏడుగురికి అప్పగించి పథకం అమలు అస్తవస్త్యంగా మార్చారు. నిర్వహణ లోపంతో పంప్‌ హౌస్‌లోని రెండు మోటార్లు పాడైపోయాయి. దీంతో మంచి వేసవిలో నాలుగు రోజుల పాటు జిల్లాలోని పలు ప్రధాన పట్టణాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది.

రూ. 508 కోట్లతో 14 గ్రామాలకు నీళ్లు!
2007లో రూ.508 కోట్లతో  514 గ్రామాలకు తాగునీటిని అందించాలన్న లక్ష్యంతో ప్రారంభమైన జేసీ నాగిరెడ్డి పథకం పనులు ఆదిలోనే నీటి సమస్యతో అనుకున్న మేర పూర్తి కాలేదు.  ప్రస్తుతం 14 గ్రామాలకు మాత్రమే ఈ పథకం ద్వారా నీటిని అందజేస్తున్నారు. అధికార పార్టీ నేతల పెత్తనం వల్ల ఈ పథకం నిర్వీర్యమవుతోందన్న విమర్శలు ఉన్నాయి. సత్యసాయి తాగునీటి పథకంలో లోపాలు లేకున్నప్పటికీ ఎక్కడపడితే అక్కడ అనువుగా ఉన్న గ్రామాలకు నీటిని మళ్లించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ స్కీమ్‌ ద్వారా  571 గ్రామాలకు నీటిని సరఫరా చేస్తున్నారు.

నిరుపయోగంగా చేతి పంపులు
జిల్లాలోని 63 మండలాల్లో 12,674 చేతి పంపులున్నాయి. వేసవి సమీపిస్తుండగానే భూగర్భ జలాలు అడుగంటి 2,487 చేతి పంపుల్లో నీరు రాకుండా పోయాయి. ఇవి కాక 872 చేతి పంపులు నిరుపయోగంగా మారాయి. అధిక శాతం చేతి పంపులు మరమ్మతులకు గురవుతున్నాయి. సకాలంలో వీటిని ప్రజావినియోగంలోకి తీసుకురావడంలో ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

జీపీఎస్‌ సిస్టమ్‌ అమలుపై విమర్శలు
కరువు పీడిత 162 గ్రామాల్లో తాగునీటి సరఫరాకు ట్యాంకర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే పదుల సంఖ్యలో ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాల్సిన చోట రెండు, మూడు ట్యాంకర్లతో సరిపెట్టి అధికార పార్టీ నేతలు జేబులు నింపుకుంటున్నారు. వాస్తవానికి తాగునీటిని సరఫరా చేస్తున్న ట్యాంకర్లకు జీపీఎస్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేయాల్సి ఉంది. దీని వల్ల ట్యాంకర్లు ఎన్ని ట్రిప్పుల నీటిని ప్రజలకు అందజేసింది స్పష్టంగా తెలుస్తుంది. అయితే జీపీఎస్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేసిన వైనం ఎక్కడా కనిపించలేదు. ఈ లోపాన్ని ట్యాంకర్‌ నిర్వాహకులు సొమ్ము చేసుకున్నారు. ప్రజావసరాలకు తగ్గట్లుగా నీటిని సరఫరా చేయకున్నా.. అంతా బాగా చేసినట్లు రికార్డులు చూపి ప్రజాధనాన్ని దోచుకున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ ఏడాది వేసవిలో తాత్కాలికంగా తాగునీటి అవసరాలు తీర్చేందుకు వెచ్చించిన సొమ్ముతో శాశ్వత పరిష్కారాలు చూపే అవకాశమున్నా ఆ దిశగా చర్యలు చేపట్టక పోవడం విమర్శలకు దారి తీస్తోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement