మాట్లాడుతున్న పోటు రంగారావు
- న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి రంగారావు
పాల్వంచ : రాజకీయ లబ్ధికోసమే సీఎం కేసీఆర్ ఇష్టారాజ్యంగా జిల్లాల విభజన చేపట్టారని సీపీఐ (ఎంఎల్) న్యూడమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఆరోపించారు. శుక్రవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లాలో ఏర్పాటులో ఆదివాసీ గిరిజనులకు కనీస ప్రాధాన్యమివ్వలేదన్నారు. గిరిజన ప్రజల పట్ల రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. పొరుగున ఉన్న వరంగల్‌ను ఐదు జిల్లాలుగా చేసిన కేసీఆర్ ఆదివాసీలు అధికంగా ఉన్న భద్రాచలంను జిల్లా చేయక పోవడం దారుణమన్నారు. జిల్లాలో వనరులు, ఖనిజాలు బడా పారిశ్రామిక వేత్తలకు, బహుళజాతి కంపెనీలకు అప్పగించే కుట్రలో భాగంగానే జిల్లాను బలహీనం చేస్తున్నారని ఆరోపించారు. భద్రాచలం, ములుగు, ఉట్నురు ప్రాంతాలను ఆదివాసీ జిల్లాలుగా ప్రకటించాలని, పాల్వంచ డివిజన్‌ను కొనసాగించాలని డిమాండ్ చేశారు. రైతులకు నాసిరకం విత్తనాలను అంటగట్టిన కంపెనీలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెచ్చెల రంగయ్య, నాయకులు ముద్దా భిక్షం, నిమ్మల రాంబాబు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.