ఇళ్ల జోలికొస్తే ఖబడ్దార్
కంకిపాడు : రాజధాని ప్రాంతమైన విజయవాడను అందంగా తీర్చిదిద్దే పేరుతో కాల్వగట్ల వాసులను తొలగించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారధి అన్నారు. ఇళ్ల తొలగింపునకు పూనుకుంటే మాత్రం ‘ఖబడ్దార్ చంద్రబాబు, పేదల పక్షాన ఉద్యమిస్తాం’ అని హెచ్చరించారు. కంకిపాడులోని పార్టీ కార్యాలయంలో గురువారం రాత్రి విలేకరుల సమావేశం నిర్వహించారు. అభివృద్ధి, సుందరీకరణ పేరుతో ఇళ్ల కూల్చివేతకు కుట్రపన్నుతున్నారన్నారు. భగవంతుడు, దేవుడి ఆలయాలకే దిక్కులేదని, భగవంతుడి విగ్రహాలను స్టోర్‌రూమ్‌లో పడేసిన టీడీపీ ప్రభుత్వం, తమను కూడా రోడ్డుకు లాగుతుందేమో అని పేదలు భయపడుతున్నారన్నారు. ఇళ్లు తొలగింపునకు పూనుకుంటే మాత్రం చూస్తూ ఊరుకోమన్నారు. ప్రభుత్వం తగిన మూల్యం చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇళ్లు తొలగించాక వారికి ఎక్కడ స్థలాలు చూపుతావో చెప్పు అని ప్రశ్నించారు. అర్హులైన ప్రతి మనిషికి ఐదు కిలోలు రేషన్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సంక్షేమ పథకాలను పేదలకు అందించాలని, లేదంటే ప్రజలే తరిమి కొడతారని హెచ్చరించారు.
పుష్కర పనుల్లో వేల కోట్ల అవినీతి
పుష్కర పనుల్లో టీడీపీ వేల కోట్లు అవినీతికి పాల్పడుతోందని పార్థసారధి విమర్శించారు. వేల కోట్లు ఖర్చు ప్రజల కోసమా? ప్రచార ఆర్భాటం కోసమా? అని ప్రశ్నించారు. కృష్ణానది ప్రవాహం వెంబడి ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ ఘాట్‌లు ఏర్పాటుచేసి పుష్కరాలకు ఏర్పాట్లు చేయకుండా భక్తులను విజయవాడ రప్పించే ప్రయత్నం చేయటం ఎంత వరకూ సమంజసమని ప్రశ్నించారు. అభివృద్ధి కోసం కేటాయించిన కోట్లాది రూపాయలు కేవలం పుష్కరాల 12 రోజులు కోసం మాత్రమే కాదని, అభివృద్ధి శాశ్వత ప్రాతిపదికగా జరగాలని సూచించారు. పుష్కర పనుల్లో జరిగిన అవినీతిపై నిజాయితీపరుడైన అధికారితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
టీడీపీ, బీజేపీల నాటకాలు
ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్‌సీపీ చేపట్టిన బంద్ విజయవంతమైందన్నారు. టీడీపీ ఎంపీలు ఓ వైపు పార్లమెంటులో ధర్నాలు చేస్తూనే మరో వైపు హోదా రాదంటూ ప్రజల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ, టీడీపీలు నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. సమావేశంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బండి నాంచారయ్య, పెనమలూరు నియోజకవర్గ నేత తుమ్మల చంద్రశేఖర్, స్టీరింగ్ కమిటీ సభ్యుడు బాకీ బాబు, ముసలయ్య, జే. నాగేశ్వరరావు పాల్గొన్నారు.