జంట హత్యతో కలకలం
వివాహేతర సంబంధమే కారణం
ఆటోడ్రైవర్, అతని స్నేహితుడు హత్య
బుక్కచెర్ల గ్రామంలో విషాద ఛాయలు
జంట హత్యలతో ‘అనంత’ ఉలిక్కిపడింది. అనంతపురం రూరల్ మండలం రుద్రంపేట సమీపంలో గోపీనాయక్, వెంకటేశ్‌నాయక్‌ల హత్యను మరువకనే ఇదే మండలం కక్కలపల్లి గ్రామ సమీపంలో మరో జంట హత్య వెలుగు చూడటం కలకలం రేపింది. తాజాగా జరిగిన హత్యకు వివాహేతర సంబంధమే కారణమని తెలిసింది.
అనంతపురం సెంట్రల్ : వివాహేతర సంబంధం రెండు నిండు ప్రాణాలను బలిగొంది. గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటన శుక్రవారం ఉదయం వెలుగు చూసింది. పోలీసులు, గ్రామస్తుల కథనం మేరకు... రాప్తాడు మండలం బుక్కచెర్ల గ్రామానికి చెందిన నారాయణరెడ్డి కుమారుడు జయచంద్రారెడ్డి (22) ఆటో డ్రైవర్. ఇతను గ్రామంలోని ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం ఆమె బంధువులకు తెలియడంతో కొంత కాలం క్రితం గొడవ జరిగింది. పద్ధతి మార్చుకోవాలని జయచంద్రారెడ్డిని పలుమార్లు హెచ్చరించారు. అయినా మార్పు రాకపోవడంతో విసిగిపోయిన మహిళ బంధువులు జయచంద్రారెడ్డిని ఎలాగైనా మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నారు.
అదును చూసి.. అంతమొందించారు..
జయచంద్రారెడ్డి అక్క కుమారుడికి గురువారం సాయంత్రం కుక్క కరిచింది. కుటుంబ సభ్యులతో కలిసి బాలుడిని తీసుకుని రాత్రి 9.30గంటలకు అనంతపురం సర్వజనాసుపత్రికి తన ఆటోలో తీసుకొచ్చాడు. అక్కడ అడ్మిషన్ చేయించిన అనంతరం అదే రోజు రాత్రి తన స్నేహితుడు అశోక్‌కుమార్‌రెడ్డి(22)తో కలిసి స్వగ్రామానికి బయల్దేరాడు. అప్పటికే కాపు కాచిన మహిళ బంధువులు ఆటోను అటకాయించారు. మార్గమధ్యంలో ఇద్దరిపై దాడి చేసి, తాడులతో గొంతు బిగించి హతమార్చారు. అనంతరం అనంతపురం రూరల్ మండలం కక్కలపల్లి గ్రామ సమీపంలో రోడ్డుపక్కన పడేసి వెళ్లిపోయారు. జయచంద్రారెడ్డి–అశోక్‌కుమార్‌రెడ్డి మృతితో బుక్కచెర్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
కేసు నమోదు
జంట హత్యలు జరిగిన విషయం వెలుగులోకి రావడంతో అనంతపురం రూరల్ సీఐ కృష్ణమోహన్, ఎస్‌ఐలు జగదీష్, నాగేంద్రప్రసాద్‌లు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడే ఉన్న ఆటోను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. మృతుల బంధువులు ఫిర్యాదు మేరకు రాప్తాడు మండలం కొత్తపల్లికి చెందిన మహిళ సోదరుడు సోమనాథ్‌యాదవ్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.