వారానికి మూడు సార్లు కోడిగుడ్లు
Published Sun, Sep 4 2016 12:33 AM | Last Updated on Thu, Jul 11 2019 5:40 PM
విద్యారణ్యపురి : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో ఇక నుంచి వారానికి మూడుసార్లు కోడిగుడ్లు అందజేయనున్నారు. గతంలో వారానికి రెండు సార్లు కోడిగుడ్లు అందజేస్తుండగా ఇక నుంచి మూడు గుడ్లు అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో భాగంగా మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీలకు 2016–17 సంవత్సరానికి చెల్లించాల్సిన నిధులను ప్రభుత్వం మంజూరు చేయగా.. డీఈఓ మండలాల వారీగా విడుదల చేశారు. జిల్లాలోని 3,444 ప్రభుత్వ పాఠశాలల్లో 1నుంచి 5వ తరగతి వరకు 1,24,507మంది విద్యార్థులు, 6నుంచి 8వరకు 71,964మంది విద్యార్థులు, 9నుంచి 10వ తరగతి వరకు 51,380మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందజేస్తున్నారు. ఈ మేరకు వంట ఏజెన్సీలకు చెల్లించాల్సి నగదుతో పాటు కోడిగుడ్లకు కలిపి ప్రాథమిక పాఠశాలలకు రూ.5,46,97,000, యూపీఎస్‌లకు రూ. 4,93,96,000, 9, 10వ తరగతి విద్యార్థుల కోసం 20,34,600 మంజూరయ్యాయి. ప్రాథమిక పాఠశాలల్లో ఒక్కో విద్యార్థికి కుకింగ్ కాస్ట్ కింద రూ.3.86, ఒక గుడ్డు ధర రూ.2 కలిపి రూ.5.86, యూపీఎస్‌ల్లో ఒక్కో విద్యార్థికి కుకింగ్ కాస్ట్ రూ.5,78, గుడ్డుకు రూ.2 కలిపి రూ.7.78, 9, 10వ తరగతి విద్యార్థులకు కుకింగ్ కాస్ట్ రూ.5,78, గుడ్డుకు రూ.2 కలిపి రూ.7.78చొప్పున ఏజెన్సీలకు చెల్లిస్తారు.
Advertisement