వీళ్ల ప్రాణాలకు ఏదీ హామీ?
♦ విద్యుదాఘాతాలతో మృతి చెందుతున్న యువకులు
♦ వికలాంగులవుతున్న మరికొందరు
♦ మునిపల్లి మండలంలో తరచూ సంఘటనలు
♦ బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం
♦ తమకు సంబంధం లేదంటున్న విద్యుత్ అధికారులు
మునిపల్లి: నిరుద్యోగుల అవసరం వాళ్ల ప్రాణాల మీదకు వస్తోది. రోజు కూలీలుగా విద్యుత్ తీగల మరమ్మతులకు వెళ్తూ ప్రాణాలు కోల్పోవడమో లేక వికలాంగులుగా మారడమో జరుగుతున్న ఆ శాఖ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో మునిపల్లి మండలం ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఏదైనా దుర్గటన జరిగినప్పుడు మాత్రం.. ఉద్యోగం ఇప్పిస్తామని నాయకులు కంటి తుడుపు చర్యలు తీసుకుంటున్నారు తప్ప.. బాధితులను ఆదుకోవడం లేదు.
నాలుగేళ్లుగా ఎదురుచూపులు
మునిపల్లి మండలం బుదేరా చౌరస్తా సమీపంలో నివాసం ఉంటున్న హోళియ దాసరి శ్రీనివాస్(26)ను 2012లో విద్యుత్తు మరమ్మతుల కోసం ప్రజలు రోజువారీ కూలీగా నియమించుకున్నారు. ఉద్యోగం పర్మినెంట్ చేస్తామని చెప్పి అధికారులు సైతం రోజూ పనులు చేయించుకునేవారు. ఈక్రమంలో 2014 ఏప్రిల్ 11న పెద్దగోపులారం శివారులో విద్యుత్ వైర్లను సరిచేస్తుండగా షాక్ తగిలి కుడిచేయి కాలిపోయింది. వికలాంగుడిగా మారడంతో ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చిన అధికారులు ఆపై ముఖం చాటేశారు. శ్రీనివాస్ తండ్రి బాగయ్య తన కొడుకు ఆరోగ్యం బాగుచేయించడం కోసం రూ.3 లక్షల వరకు అప్పులు చేశారు. కోలుకున్న తర్వాత ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా సంగారెడ్డిలోని విద్యుత్ అధికారుల చుట్టూ తిరి గినా ఫలితం లేదు. దీంతో అతని కు టుంబం తీవ్ర ఇబ్బందులు పడుతోంది.
మరమ్మతులకు వెళ్లి మృతి
పెద్దలోడి గ్రామానికి చెందిన సాలే అంబదాస్ ఐదేళ్ల క్రితం రోజు కూలీగా విద్యుత్తు పనులకు వెళ్లేవాడు. అంబదాస్‌కు తండ్రి సంగయ్య, తల్లి రాములమ్మ, భార్య లక్ష్మి, కుమార్తె శిరీష(5) ఉన్నారు. ఈనెల 6న ఎప్పటిలాగే గ్రామంలో ఇంటింటికీ మీటర్ రీడింగ్ చూసేందుకు వెళ్లాడు. సాయంత్రం పిల్లోడి గ్రామంలో బోరుమోటార్ పనిచేయడం కోసం వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో ఆ కుటుంబం దిక్కులేనిదైంది. మృతితో తమకు ఎలాంటి సంబంధం లేదని అధికారులు చేతులు దులుపుకున్నారు.
ఉద్యోగం వచ్చే వరకు పోరాటం
ప్రభుత్వం వచ్చే వరకు పోరాడతా. విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యం వల్లే నా కుడి చేయి కాలిపోయింది. కానీ, వాళ్లు మాకు సంబంధం లేదంటున్నారు. ప్రభుత్వం స్పందించి నా కుటుంబానికి న్యాయం చేయాలి. - శ్రీనివాస్, బాధితుడు
మాకు సంబంధం లేదు
విద్యుత్ వైర్ల మరమ్మతులు చేస్తున్న రోజువారి కూలీలతో మాకు ఎలాంటి సంబంధం లేదు. ప్రభుత్వం నియమించిన వారికి మాత్రమే ఏదైనా జరిగితే వారి కుటుంబానికి ఉపాధి కలుగుతుంది. గతంలో జరిగిన సంఘటనలతో నాకు ఎలాంటి సంబంధం లేదు.
- రాజ్‌కుమార్, ఏఈ