
జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌పై వేటు
♦ జీహెచ్‌ఎంసీ నుంచి గిరిజన శాఖకు బదిలీ
♦ భారీగా ఐఏఎస్‌ల బదిలీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. 21 మంది ఐఏఎస్‌లను, ఒక ఐఆర్‌ఎస్ అధికారిని బదిలీ చేస్తూ శుక్రవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పనితీరుపై ఫిర్యాదులు, ఆరోపణలున్న అధికారులను అప్రధాన శాఖలకు పంపిన సీఎం కేసీఆర్, పనితీరు బాగున్న వారికి కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు కసరత్తును గురువారం రాత్రే ఆయన పూర్తి చేశారు. తాజా బదిలీలు అధికార వర్గాల్లో చర్చనీయంగా మారాయి. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్‌ను అక్కణ్నుంచి తప్పించి గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేయటం సంచలనం రేపింది.
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్, డెరైక్టర్‌గా ఉన్న బి.జనార్దన్‌రెడ్డిను సోమేశ్ స్థానంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్‌గా నియమించారు. సీఎంకు సన్నిహితునిగా అధికార పార్టీ శ్రేణులకు, మిగతా రాజకీయ పార్టీల నేతలకూ మింగుడు పడని అధికారిగా సోమేశ్ ఇటీవల వివాదస్పదమయ్యారు. అధికార పార్టీకి కొమ్ముకాసి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లక్షలాది ఓట్లను తొలగించిన ఆరోపణలూ ఆయన్ను చుట్టుముట్టడం తెలిసిందే. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ పలువురు నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేశారు. వాటిపై ఈసీ స్పందించడంతో పాటు దీనిపై విచారణకు ప్రత్యేక బృందం హైదరాబాద్‌కు రానుంది.
ఈ సమయంలోనే సోమేశ్‌పై వేటు వేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరు రాష్ట్రాల మధ్య ఐఏఎస్‌ల విభజనలో సోమేశ్‌ను ఏపీకి కేటాయించగా దాన్ని ఆయన క్యాట్‌లో సవాలు చేసి తెలంగాణలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇతర మార్పుల్లో, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్‌కు భూ పరిపాలనా విభాగం ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సీసీఎల్‌ఏ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు.
రెవెన్యూ విభాగంలో ఉద్యోగ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్న ప్రిన్సిపల్ కమిషనర్ అధర్‌సిన్హాను జీఏడీకి బదిలీ చేశారు. ఎస్‌పీ సింగ్‌కు ఈసారి కీలకమైన పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి బాధ్యతలు అప్పగించారు. మంత్రితో విభేదించిన వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ చందాను పశు సంవర్ధక శాఖకు పంపారు. హెచ్‌ఎండీఏ కమిషనర్ శాలినీ మిశ్రాను ఆర్నెల్లు తిరక్కుండానే బదిలీ చేయటం గమనార్హం. జీహెచ్‌ఎంసీలో సుదీర్ఘ కాలం స్పెషల్ కమిషనర్‌గా చేసిన నవీన్ మిట్టల్‌ను సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్‌గా పంపారు.