ఎంసెట్ ప్రశాంతం
కేయూ క్యాంపస్ : ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆదివారం నిర్వహించిన టీఎస్ ఎంసెట్ –3 ప్రశాంతంగా ముగిసింది. వరంగల్‌లో ఎనిమిది కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్‌అండ్‌సైన్స్ కళాశాల, కేయూలోని కోఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కళాశాల, యూనివర్సిటీలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కళాశాల, హ్యుమానిటీస్ భవనం, యూనివర్సిటీ ఫార్మసీ కళాశాల, వడ్డేపల్లిలోని ప్రభుత్వ పింగిళి డిగ్రీ కళాశాల, సీకేఎం ఆర్ట్స్‌అండ్‌సైన్స్ కళాశాల, వరంగల్‌లోని ఎల్‌బీ కళాశాల కే ంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. కేయూలో నాలుగు కేంద్రాలు ఉండగా.. అభ్యర్థులు, వారి వెంట వచ్చిన వారితో సందడిగా మారింది. కొందరు అభ్యర్థులు ఉరుకులు పరుగుల మీద కేంద్రాలకు చేరుకున్నారు. కేంద్రాల వద్ద బయోమెట్రిక్ ద్వారా అభ్యర్థుల వేలిముద్రలు, ఫొటోలు తీశారు. పరీక్ష ఉదయం 10 గంటలకు కాగా, 9 గంటల నుంచే కేంద్రాల్లోకి అనుమతించారు. నిర్ణీత సమయం తర్వాత నిమిషం ఆలస్యం గా వచ్చినా అనుమతించలేదు. హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్‌అండ్‌సైన్స్ కాలేజీ కేంద్రం వద్ద నిర్దేశిత సమయం తర్వాత వచ్చిన ముగ్గురు అభ్యర్థులు ప్రవళిక, రూప, నరేష్‌ను లోనికి అనుమతించలేదు. దీంతో వారు పరీక్ష రాయలేక విలపిస్తూ వెనుదిరిగారు. 8 పరీక్ష కేంద్రాల్లో కలిపి మొత్తం 4,710 మందికి గాను 3,497 మంది(74 శాతం) హాజరయ్యారని రీజినల్ కో ఆర్డినేటర్ ప్రొఫెసర్ పి.మల్లారెడ్డి తెలిపారు.8 మంది చీఫ్‌సూపరింటెండెంట్లు, 12 మంది అబ్జర్వర్లతోపాటు జేఎన్‌టీయూ నుంచి మరో నలుగురు ప్రత్యేక పరిశీలకులు పరీక్ష కేంద్రాలను పర్యవేక్షించారు. కేయూ వీసీ ప్రొఫెసర్ ఆర్.సాయన్న, ఇన్‌చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బెనర్జీ తదితరులు తనిఖీ చేశారు.