హోరా హోరీగా ఉద్యోగుల క్రికెట్ పోటీలు
అనంతపురం సప్తగిరి సర్కిల్ : ఉద్యోగుల క్రికెట్ పోటీలు హోరాహోరీగా జరుగుతున్నాయి. ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ జ్ఞాపకార్థం ఉద్యోగులకు క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారు. ఆదివారం స్థానిక అనంత క్రీడా మైదానంతో పాటు నీలం సంజీవరెడ్డి స్టేడియంలో పోటీలు జరిగాయి. హాకీ మైదానంలో ఏపీ ట్రాన్స్‌కో, న్యాయవాదుల జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన న్యాయవాదుల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 221 పరుగులు సాధించగా... ట్రాన్స్‌కో జట్టు 18 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. నీలం సంజీవరెడ్డి మైదానంలో పోలీస్, మెడికల్ రెప్రజెంటేటివ్స్ జట్లు తలపడ్డాయి.
మొదట బ్యాటింగ్ చేసిన మెడికల్ రెప్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 ఓవర్లలో 175 పరుగులు చేయగా.. తర్వాత బ్యాటింగ్ చేసిన పోలీస్ జట్టు కేవలం 4 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలో 176 పరుగులు చేసింది. విన్సెంట్ క్రీడా మైదానంలో ఉపాధ్యాయులు, రెవిన్యూ ఉద్యోగుల జట్లు తలపడ్డాయి.రెవిన్యూ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 175 పరుగులు చేయగా.. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఉపాధ్యాయుల జట్టు 20 ఓవర్లలో 169 పరుగులు మాత్రమే చేసింది.
విన్సెంట్ క్రీడా మైదానంలో జరిగిన మరో మ్యాచ్‌లో గుంతకల్లు రైల్వేస్, ఎస్కేయూ నాన్ టీచింగ్ జట్లు తలపడ్డాయి. గుంతకల్లు రైల్వేస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్కేయూ నాన్ టీచింగ్ జట్టు కేవలం 68 పరుగులకే కుప్పకూలింది. ఉద్యోగుల క్రికెట్ క్రీడా పోటీలు వచ్చే ఆదివారం కూడా కొనసాగుతాయని టోర్నీ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మెన్ చంద్రమోహన్‌రెడ్డి, కార్యదర్శి అలీలు తెలిపారు.