ముదురుతున్న ప్రొటోకాల్ వివాదం
⇒ ఎమ్మెల్యే వైఖరిపై ఉద్యోగుల నిరసన
⇒ నిరసనలు వద్దని చేతులు జోడించిన కలెక్టర్
⇒ రసమయికి మద్దతుగా కళాకారుల ధర్నా
సాక్షి, కరీంనగర్: కరీంనగర్‌లో బుధవారం నిర్వహించిన డిజీధన్ మేళాలో జరిగిన ప్రొటోకాల్ వివాదం చినికి చినికి గాలివానలా మారింది. ఎమ్మెల్యేలకు మద్దతుగా కళాకారులు, కలెక్టర్‌కు సంఘీభావంగా ఉద్యోగులు నిరసనకు దిగడం చర్చనీయాంశంగా మారింది. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ హాజరైన డిజీ ధన్‌మేళాలో కలెక్టర్, ఎమ్మెల్యేల మధ్యన ఫ్రోటోకాల్ వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌పై ఎమ్మెల్యే వైఖరిని వ్యతిరేకిస్తూ సోమవారం కలెక్టరేట్‌లో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో నిరసనకు దిగారు.
ఈ ఘటనపై స్పందించిన కలెక్టర్ వెంటనే అధికారులు, ఉద్యోగులను పిలిచి నిరసనలు వద్దంటూ చేతులు జోడించారు. మరో వైపు కలెక్టర్‌కు వ్యతిరేకంగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మద్దతుదారులు, సాంస్కృతిక సారథి కళాకారులు నిరసన వ్యక్తం చేశారు. దళిత సంఘాలు జిల్లావ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి. కాగా బుధ, గురువారాల్లో జరిగిన సంఘటనలపై ముఖ్యమంత్రి కేసీఆర్ పేషీ రంగంలోకి దిగగా, వివాదం వెనుక వాస్తవాలు ఏమిటి? అన్న కోణంలో ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఆరా తీస్తుండటం చర్చనీయాంశంగా మారింది.