
బాస్ ఉంటేనే.. విధుల్లో..
నిజామాబాద్ నాగారం : అది యువజన సంక్షేమ శాఖ కార్యాలయం. ఈ కార్యాలయంలోని ఉద్యోగులు సీఈవో ఉన్నపుడు మాత్రమే విధులు నిర్వర్తిస్తూ ఆయన అధికారిక పనుల నిమిత్తం బయటకు వెళ్లగానే విధులకు డుమ్మా కొడుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ శాఖలో ఇది కొత్తకాదు. సిబ్బంది సమయపాలన పాటించడంలేదని గతంలో కలెక్టర్ ఆదేశాల మేరకు బయోమెట్రిక్ విధానంను ప్రారంభించారు.
కానీ సిబ్బంది ఈ విధానాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఉదయం బయోమెట్రిక్‌లో హాజరు వేయడానికి కార్యాల యానికి వస్తున్నారు. కొందరు 11 గంట లు, మరికొందరు 12 గంటల సమయం దాటగానే కార్యాలయం నుంచి బయటకు జారుకుంటున్నారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయి. ఒకరిద్దరు అధికారులు, ఒక అటెండర్ మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు.
స్టెప్ సీఈవోకు అదనంగా బీసీ కార్పొరేషన్, టూరిజం శాఖ ఉండడంతో ఆయన నిత్యం అధికారిక సమావేశాలు, సమీక్షలతో బిజీగా ఉంటున్నారు. దీంతో సొంత శాఖలో సిబ్బందిపై పర్యవేక్షణ లేకపోవడంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పలు పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చిన వారికి అధికారులు లేకపోవడంతో ఎవరిని సంప్రదించాలో అర్థం కావడం లేదని పలువురు వాపోతున్నారు.