ఉద్యోగుల ఉద్యమబాట
Published Sun, Sep 18 2016 9:29 PM | Last Updated on Thu, Mar 28 2019 8:28 PM
–ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఉద్యోగుల ధర్నా
–నేడు కలెక్టరేట్ ఎదుట నిరసన
తాడేపల్లిగూడెం: హెచ్‌ఐవీ, ఎయిడ్స్, క్షయ బాధితులకు ఎనలేని సేవలందిస్తున్న ఉద్యోగుల జీవితాల్లో మాత్రం వెలుగు కనిపించడం లేదు. శ్రమకు తగిన ఫలితం ఉండటం లేదు. చాలీచాలని వేతనాలు, హామీలకే పరిమితమైన ఇంక్రిమెంట్లు, మూడేళ్లుగా సుదీర్ఘ పోరాటం చేస్తున్నా కనికరం లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (ఏపీ సాక్). దిక్కుతోచని స్థితిలో రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని ఏఆర్‌టీ సెంటర్, వలంటరీ కౌన్సెలింగ్ టెస్టింగ్ సెంటర్లలో పనిచేస్తున్న 1,250 మంది ఉద్యోగులు సోమవారం కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాకు సన్నద్ధమయ్యారు. జిల్లాలోని నాలుగు ఏఆర్‌టీ సెంటర్లలో పనిచేస్తున్న 100 మంది ఉద్యోగులు ధర్నాకు దిగుతున్నారు.
జిల్లాలో నాలుగు సెంటర్లు.. 100 మంది ఉద్యోగులు
జిల్లాలో తాడేపల్లిగూడెం, తణుకు, భీమవరం, ఏలూరులోని ఏఆర్‌టీ సెంటర్లలో మెడికల్ ఆఫీసర్లుగా, డాటా మేనేజర్లుగా, స్టాఫ్‌నర్సులుగా, ల్యాబ్‌టెక్నీషియన్లుగా, ఫార్మాసిస్టులుగా, కేర్ కో ఆర్డినేటర్లుగా 100 మంది పనిచేస్తున్నారు. వీరిని ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగులుగా నియమించింది. అర్హత, అనుభవం, కేడర్‌ను బట్టి నెలకు రూ.6 వేల నుంచి రూ.46 వేల వరకు వేతనం అందిస్తున్నారు. వేతన ఒప్పందం ప్రకారం ఏటా రూ.1,250 పెంచాలి. అయితే 2013 నుంచి వేతన పెంపుదలతో ఏపీ సాక్ తాత్సారం చేస్తోంది. చివరకు 2016–17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పాత బకాయిలు మినహా, ఈ ఏడాదికి 2.5 శాతం అంటే రూ.750 వేతనం పెంచుతానని అధికారులు ప్రకటించారు. దీంతో పాటు ఇతర సమస్యల పరిష్కారానికి ఉద్యోగులు ఉద్యమబాట పట్టారు.
డిమాండ్లు ఇవి
–ఏఆర్‌టీ సెంటర్లలో పనిచేసే ఉద్యోగులను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలి.
–ఐదేళ్లు తర్వాత ఇచ్చిన వార్షిక ఇంక్రిమెంటును 20 శాతంగా, రూ.2,500 నుంచి రూ.3,000 రూపాయలు ఇవ్వాలి.
–నాకో జారీచేసిన ఆర్డర్ ప్రకారం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతన స్థిరీకరణ చేయాలి.
–ఏడో పీఆర్సీ ప్రకారం ఉద్యోగులందరికీ వర్తింపచేయాలి.
–వేతన నిర్ణయంలో విద్యార్హతలు, సీనియారిటీ పరిగణనలోకి తీసుకోవాలి.
–ఎయిడ్స్ కంట్రోల్‌ను మినిస్ట్రీ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌లో విలీనం చేయాలి.
–ఉద్యోగులకు ఆరోగ్య పాలసీ అమలుచేయాలి.
–ఆరోగ్య బీమా, గ్రూప్ ఇన్సూ్యరెన్సు అమలుచేయాలి.
–సమాన పనికి సమాన వేతనం అందించాలి.
–హెచ్‌ఆర్ పాలసీ అమలుచేయాలి.
మూడేళ్లుగా పరిష్కారం లేదు
ఏపీ సాక్‌లో పనిచేసే ఉద్యోగులకు మూడేళ్లుగా ఇస్తానన్న ఇంక్రిమెంట్లు ఇవ్వడంలేదు. ఏఆర్‌టీ సెంటర్లలో పనిచేసే ఉద్యోగులు క్షయ వంటి వ్యాధులు సోకి మరణిస్తున్నా, ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడంలేదు. దీంతో జాతీయ యూనియన్ పిలుపుమేరకు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్నాం. రాష్ట్రంలోని ఏఆర్‌టీ కేంద్రాల్లో పనిచేసే 1,250 మంది ధర్నాలో పాల్గొననున్నారు.
–సీహెచ్ సత్యనారాయణ, తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రి ఏఆర్‌టీ సెంటర్
Advertisement
Advertisement