ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య!
లెక్చరర్ వేధింపులతో ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది.
- లెక్చరర్ వేధింపులే కారణం
- ప్రేమ పేరిట పైశాచికం
- తోటి విద్యార్థుల సాయంతో రహస్యంగా ఫొటోల చిత్రీకరణ
- వాట్సాప్ సందేశాలతో ప్రేమాయణం
- తాళలేక తనువు చాలించిన ఉషారాణి
- ఆర్‌జీఎం ఇంజనీరింగ్ కాలేజీలో ఘటన
కళ్లెదుట అందమైన ప్రపంచం. ఇంజనీరింగ్ విద్యతో కళ సాకారమవుతుందనే ఆశ. తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టే ప్రయత్నంలో ఆ విద్యార్థిని ఒక్కో అడుగు ముందుకేస్తోంది. ఈ ప్రయాణంలో అనుకోని ఒడిదుడుకు ఆమె జీవితాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. లక్ష్యం దిశగా సాగుతున్న అడుగులకు ఊతమివ్వాల్సిన అధ్యాపకుడు.. తోడు నిలవాల్సిన సాటి విద్యార్థులే ఆమెకు మరణ శాసనం రాయడం తల్లిదండ్రుల ఆశల దీపాన్ని ఆర్పేసింది.
సాక్షి ప్రతినిధి, కర్నూలు: లెక్చరర్ వేధింపులతో ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. పాణ్యం సమీపంలోని ఆర్జీఎం కాలేజీలో ఉషారాణి ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతోంది. విద్యార్థుల భవిష్యత్‌కు బంగారు బాటలు వేయాల్సిన ఓ లెక్చరర్ కన్ను ఈమెపై పడింది. ప్రేమ పాఠాలు చెబుతూ.. ప్రేమించాలని వెంటబడ్డాడు. నిరాకరించడంతో.. బలవంతంగా లొంగదీసుకోవాలనుకున్నాడు. అందులో భాగంగానే కొందరు విద్యార్థినులను మచ్చిక చేసుకున్నాడు. బట్టలు మార్చుకుంటున్నప్పుడు.. ఆదమరిచి నిద్రిస్తున్నప్పుడు ఫొటోలు తీయించాడు. ఆమె ఫోన్‌లోని వాట్సాప్‌కే ఫొటోలను పంపిన లెక్చరర్.. నీ చుట్టూ ఉన్న ప్రపంచమంతా తన సొంతమనే వెకిలి సందేశాలతో వేధించసాగాడు. షాక్ తిన్న ఉషారాణి.. పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. ఫొటోలను కాలేజీలో అందరికీ పంపుతానని బెదిరించడంతో ఆందోళనకు లోనైంది. ఇంతలో దీపావళి సెలవులు రావడంతో ఇంటికి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులతో జరిగిన విషయమంతా చెప్పి.. సెలవులు పూర్తయ్యాక తండ్రితో కలిసి కాలేజీకి వచ్చింది. ఆమె తండ్రి జరిగిన విషయాన్ని ప్రిన్సిపాల్‌కు పూసగుచ్చినట్లు వివరించాడు.ఽ యాజమాన్యం ఆయనకు నచ్చజెప్పడంతో ఉషారాణి హాస్టల్‌కు వెళ్లిపోయింది.
తండ్రి ఇంటికి చేరుకునే లోపు..
కాలేజీలో వదిలిన తండ్రి కుమార్తెకు ధైర్యం చెప్పి వెళ్లాడు. అయితే లెక్చరర్ వేధింపులు గుర్తుకొచ్చిన ఆమె ఇక తన ఈ లోకంలో ఉండలేననే నిర్ణయానికి వచ్చింది. తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.
తప్పును కప్పి పుచ్చే ప్రయత్నంలో యాజమాన్యం?
విద్యార్థిని మృతికి లెక్చరర్ వేధింపులు కారణమనే విషయం కళాశాల అంతా కోడై కూస్తున్నా యాజమాన్యం మాత్రం కొత్త కారణం తెరపైకి తీసుకొచ్చింది. అనారోగ్యం కారణంగానే ఆమె సెలవుపై వెళ్లిందని.. ఇంటి వద్ద ఏదో జరిగితే ఇక్కడ ఆత్మహత్య చేసుకున్నట్లుగా చెప్పడం విద్యార్థుల ఆగ్రహానికి కారణమవుతోంది. ఇప్పటి వరకు పోలీసులు కానీ, కాలేజీ యాజమాన్యం కానీ లెక్చరర్ వేధింపుల కోణాన్ని బహిర్గతం చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఓ విద్యార్థిని భవిష్యత్‌ను చిదిమేసిన లెక్చరర్‌ను కాపాడే ప్రయత్నం చేస్తూ.. సాధారణ ఆత్మహత్యగా చిత్రీకరించే దిశగా సాగుతున్న ప్రయత్నం విద్యార్థి లోకాన్ని కలచివేస్తోంది.