పదికి పరీక్ష!
• పరీక్ష ఫీజు పేరుతో అదనపు వసూళ్లు
• దోపిడీకి రంగం సిద్ధం చేసిన ప్రైవేటు విద్యాసంస్థలు
• అసలు ఫీజు రూ.125, వసూలు రూ.1,700 వరకు
• జిల్లాలోని విద్యార్థులపై రూ.1.5 కోట్ల అదనపు భారం
• చోద్యం చూస్తున్న విద్యాశాఖ అధికారులు
‘పది’ ఈ సంఖ్యకు చాలా క్రేజ్ విద్యార్థుల భవితకు కీలకమైంది పదవ తరగతి. జీవితంలో ఇది తొలి పబ్లిక్ పరీక్ష కావడంతో అందరికీ ‘టెన్’షన్ ఇందులో ప్రతిభ కనబర్చిన వారికే గుర్తింపు అధికం దీనిని ఆసరాగా చేసుకొని ప్రైవేటు పాఠశాలలు దోపిడీ చేస్తున్నారుు. పరీక్ష ఫీజు పేరిట వేలకు వేలు ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి.. ఇదంతా చూస్తూ కూడా విద్యాశాఖ యథావిధిగా మౌనం దాల్చుతోంది...!
ఒంగోలు : పరీక్షల ఫీజుకు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన రుసుం కేవలం కాగితాలకే పరిమితమవుతోంది. ఎవరిష్టం వచ్చినంత వారు దోచుకొనేందుకు రంగం సిద్ధమైంది. పదో తరగతి పబ్లిక్ పరీక్ష ఫీజు వాస్తవానికి రూ. 125 చెల్లించాల్సి ఉండగా.. ఏకంగా రూ.1000 రూ. 1500 వరకు వసూలు చేయడం పరిపాటిగా మారింది. జిల్లాలో ఈ అదనపు వసూలు విలువ రూ.1.50 కోట్లు ఉంటుందని అంచనా. దీనిని పర్యవేక్షించాల్సిన విద్యాశాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం విచారకరం. గత ఏడాది ఇదే వ్యవహారంపై జిల్లా పరిషత్ చైర్మన్ విద్యాశాఖకు చురకలు అంటించినా ఎలాంటి మార్పు రాలేదు.
తుది గడువు ఈనెల 18..
పరీక్షల చెల్లింపునకు ఈనెల 18వ తేదీ వరకు గడువు ఉంది. ఇప్పటికైనా అధికారులు పర్యవేక్షిస్తే దోపిడీని కొంతవరకు అరికట్టువచ్చని తల్లిదండ్రులు కోరుతున్నారు. లేదంటే విద్యార్థులే నేరుగా చలానా చెల్లించే అవకాశం కల్పించాలి. దీనివల్ల యూజమాన్యాల పెత్తనాన్ని అరికట్టువచ్చు.
వేలాది మంది విద్యార్థులు
జిల్లాలో మొత్తం 370పైగా ప్రభుత్వ, జిల్లా పరిషత్,ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలున్నాయి.వీటిలో 24వేల మంది పదో తరగతి విద్యార్థులున్నారు.ఇక 300పైగా ప్రభుత్వ గుర్తింపు కలిగిన అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో 16వేల మంది విద్యనభ్యసిస్తున్నారు. ఒకేషనల్ విద్యార్థులు అరుుతే రూ. 125కి అదనంగా రూ. 60 చెల్లిస్తే సరిపోతుంది. అరుుతే వివిధ ఖర్చుల నిమిత్తం ప్రభుత్వ ఆధ్వర్యంలోని పాఠశాలల్లో రూ.150 నుంచి రూ. 200 వరకు తీసుకుంటున్నారు. సరాసరిన ఒక్కొక్కరికి రూ. 50 అదనంగా చెల్లించినా రూ. 12 లక్షలు మేర అదనపు భారం తప్పడంలేదు. ఇక ప్రైవేటు పాఠశాలల్లో గరిష్టంగా రూ. 1700 వరకు తీసుకుంటున్నట్లు తెలిసింది. ఎవరైనా అడిగితే విద్యాశాఖలోని అధికారులకు కూడా వాటాలు ఇచ్చుకోవాల్సి వస్తుందనే సమాచారం వినిపిస్తుంది. ప్రతి నామినల్ రోల్‌కు కనీసంగా రూ.100 నుంచి రూ.200 చొప్పున వసూలుచేస్తారని వినికిడి.
రవాణా ఖర్చుల పేరుతో వసూళ్ల పర్వం..
విద్యార్థికి అందించే సర్వీస్‌తోపాటు పరీక్షల సమయంలో 11 రోజులపాటు విద్యార్థిని పాఠశాల వద్దనుంచి పరీక్ష కేంద్రం వరకు, తిరిగి అక్కడ నుంచి పాఠశాల వరకు క్షేమంగా తీసుకువచ్చేందుకు రవాణా ఖర్చులు పేరుతో గుర్తింపు పొందిన పాఠశాలలు వసూళ్ల పర్వం మొదలుపెట్టేశాయి. ఇక కార్పొరేట్ పాఠశాలల తీరే వేరు. ఒక్కో విద్యార్థి వద్ద నుంచి సరాసరి రూ.1200 చొప్పున వసూలు చేస్తున్నారని అనుకుంటే వసూలయ్యే మొత్తం రూ.1.92 కోట్లు. వాస్తవానికి విద్యార్థులు చెల్లించాల్సిన మొత్తం రూ.20 లక్షలు మాత్రమే. అంటే అనధికారికంగా వసూలు చేస్తున్న మొత్తం రూ.1.72 కోట్లు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని పాఠశాలల నుంచి రూ.12 లక్షలు, గుర్తింపు పొందిన అన్ ఎయిడెడ్ విద్యాసంస్థల నుంచి రూ.1.72 కోట్లు వెరసి రూ.1.84 కోట్ల దోపిడీకి రంగం సిద్ధమైంది.