టీడీపీ ప్రభుత్వ అక్రమాలను వివరించండి
సాక్షి, విశాఖపట్నం: ప్రతి గడపకు వెళ్లండి.. ప్రతి ఒక్కరినీ కలవండి.. చంద్రబాబు సర్కార్ వైఫల్యాలను ఎండగట్టండి.. అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ నేతలను ఆదేశించారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘గడప గడపకు వైఎస్సార్’ కార్యక్రమం అమలుపై విశాఖ జిల్లా నేతలతో పార్టీ అధినేత నిర్వహించిన సమీక్ష వివరాలను పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ స్థానిక విలేకర్లకు ఫోన్‌లో వివరించారు. ‘గడప గడపకు వైఎస్సార్‌సీపీ ప్రారంభించి 40 రోజులు దాటింది. రాష్ట్ర వ్యాప్తంగా మంచి స్పందన వస్తోంది. మీ జిల్లాలో కార్యక్రమం ఎలా జరుగుతోంది.. ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తోంద’ని పార్టీ అధినేత జగన్ ఆరా తీశారన్నారు. నెలకు 16 రోజుల కంటే తక్కువగా ఎక్కడైతే ఈ కార్యక్రమం చేయలేదో ఆయా నియోజక వర్గాల నేతలకు తాను స్వయంగా ఫోన్ చేశానని, ఒక్కసారి కూడా విశాఖ జిల్లాకు ఫోన్ చేసే అవసరం రాలేదని పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ జిల్లాలోని సమన్వయకర్తలను అభినందించారని అమర్‌నాథ్ తెలిపారు. ఇదే స్ఫూర్తితో ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కర్ని కలిసే వరకు ఈ కార్యక్రమం కొనసాగించాలని జగన్ సూచించారన్నారు. గత రెండేళ్లలో టీడీపీ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలను వివరించండని పార్టీ నేతలకు సూచించారని తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు బూడి ముత్యాలనాయుడు, గిడ్డి ఈశ్వరి, మాజీ ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, తైనాల విజయ్‌కుమార్, కరణం ధర్మశ్రీ, కో ఆర్డినేటర్లు వంశీకష్ణ శ్రీనివాస్, కోలా గురువులు, అన్నంరెడ్డి అదీప్‌రాజు, తిప్పల నాగిరెడ్డి, పెట్ల ఉమాశంకర గణేష్, వీసం రామకష్ణ, చిక్కాల రామారావు, ప్రగడ నాగేశ్వరరావు, అదనపు కో ఆర్డినేటర్ బొడ్డేడ ప్రసాద్, అరుకు త్రిసభ్య కమిటీ సభ్యులు కె.అరుణకుమారి, పోయా రాజారావు, జర్సింగి సూర్యనారాయణ పాల్గొన్నారు.
ప్రతి గడపకు వెళ్లండి.. బాబు సర్కార్ వైఫల్యాలను చెప్పండి
Published Thu, Aug 18 2016 12:19 AM | Last Updated on Wed, Aug 8 2018 5:41 PM
Advertisement
Advertisement