
కంపోస్టు ఎరువుల తయారీ
రసాయనిక ఎరువులు వాడకమే కారణం
పడిపోతున్న పంటల దిగుబడి
సేంద్రియంతో ఈ దుస్థితికి అడ్డుకట్ట
గజ్వేల్ ఏడీఏ శ్రావణ్‌కుమార్ సలహాలు, సూచనలు
గజ్వేల్: రసాయనిక ఎరువులు విచక్షణ రహితంగా వాడటం వల్ల భూముల్లో సారం తగ్గిపోయి పంటల దిగుబడి కూడా పడిపోతున్నది. రసాయనిక ఎరువుల వాడటంతో వాతావరణ కాలుష్యం తలెత్తి రసాయనిక ప్రమేయమున్న పంటల ఉత్పత్తి జరుగుతున్నది. ఈ దుస్థితికి అడ్డుకట్ట వేయడానికి రైతులు సేంద్రియ ఎరువుల వాడకంపై దష్టి సారించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఈ అంశంపై గజ్వేల్ ఏడీఏ శ్రావణ్‌కుమార్ (సెల్: 7288894469) అందించిన సలహాలు, సూచనలు ఇవి...
1. పంటకు కావాల్సిన ముఖ్యమైన పోషకాలను సేంద్రియ ఎరువుల ద్వారా అందించవచ్చు.
2. నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్నపుడు సేంద్రియ ఎరువులు... భూమి పొరల్లో ఉండే నీటిని మొక్కలకు అందేవిధంగా చేస్తాయి.
3. సేంద్రియ ఎరువులు భౌతిక లక్షణాలను ప్రభావితం చేస్తాయి. ఇసుక నేలల్లో మెత్తని మట్టి శాతాన్ని పెంచడానికి, నీటిని పట్టి ఉంచే శక్తిని పెంపొందించడానికి దోహదపడతాయి. ఫలితంగా మొక్కలు పరిస్థితులకు తట్టుకొని పెరగడానికి వీలవుతుంది.
4. వివిధ రకాల ఎరువుల వల్ల కలిగే సమస్యలను సేంద్రియ ఎరువుల వాడకం ద్వారా పరిష్కరించుకోవచ్చు.
5. నేలల్లో మొక్కలకు మేలు చేసే అనేక రకాల సూక్ష్మజీవులు ఉంటాయి. ఈ సూక్ష్మజీవుల వద్ధికి సేంద్రియ ఎరువులు ఆహారంగా ఉపయోగపడతాయి.
సేంద్రియ ఎరువుల లభ్యత
1. పశువుల పెంటను, పేడను కంపోస్ట్ అనే పద్ధతి ద్వారా నిల్వ చేయడం ద్వారా పోషకపదార్థాలు నష్టంకాకుండా కాపాడుకోవచ్చును.
2. కోళ్ల ఎరువును, బాతుల ఎరువును, పందుల పేడను, గొర్రెల పెంటను పోగుచేసి కుళ్లిపోయేలా చేసి ఉపయోగించవచ్చు.
3. గృహ సంబంధమైన వ్యర్థ పదార్థాలలో, కొయ్యబొమ్మల తయారీలో లభించే వ్యర్థ పదార్థాలు, తినడానికి ఉపయోగించిన ఆకులు, ఆయిల్‌కేక్ మొదలగునవి.
సేంద్రియ ఎరువుల రకాలు
కంపోస్ట్ ఎరువులు
సాధారణంగా గ్రామాల్లో వివిధ పంటల నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలతో కంపోస్ట్‌ను తయారు చేస్తారు. కలుపు మొక్కలు, తాలు, చెరకు ఆకులు, వేరుశనగ పొట్టు, పేడ మొదలైనవి కంపోస్ట్ తయారీకి ఉపయోగపడతాయి. కంపోస్ట్ తయారీకి ముందుగా ఆరు మీటర్ల పొడవు, రెండు మీటర్ల వెడల్పు, ఒక మీటరు లోతుగల గుంతలను తవ్వాలి. ఈ గుంతలలో పంటల అవశేషాలను 30సెం.మీ మందం పొరలుపొరలుగా నింపాలి. నేల మట్టం నుంచి 4.5ఎత్తు వరకు నింపి ఆపై మట్టిపొర గుంతను పూడ్చాలి. మూడు నెలల్లో గుంతలోని ఎరువు పంటలకు ఉపయోగపడేవిధంగా మారుతుంది.
పచ్చిరొట్ట ఎరువులు
పచ్చి రొట్ట ఎరువులు సస్యజాతికి చెందిన జనుము, పిల్లిపిసరా, జీలుగా లాంటి పంటలను పొలంలో వేసి పూత సమయంలో కోసి కలియదున్నడం, పచ్చి ఆకు లభించని చోట రైతులు పచ్చి రొట్టలు పెంచి కలియదున్నుతారు. పచ్చిరొట్ట ఎరువు వరుసగా 5సంవత్సరాలు చౌడుభూముల్లో వాడితే చౌడు ప్రభావం తగ్గి పంటల దిగుబడి పెరుగుతుంది.
బయో ఫర్టిలైజర్స్
పప్పుజాతికి చెందిన మొక్కలలో వేరు బుడిపెలు ఉంటాయి. వీటిలో రైజోబియం అనే బాక్టీరియా గాలిలోని నత్రజని తీసుకొని మొక్కలకు అందించడానికి ఉపయోగపడుతుంది.