పూజ చేస్తానని నమ్మించి 17 కాసుల బంగారం చోరీ
Published Wed, Dec 14 2016 11:12 PM | Last Updated on Mon, Sep 4 2017 10:44 PM
మూఢ నమ్మకాన్ని ఆసరాగా తీసుకుని మోసం
కాకినాడ క్రైం : ఓ మహిళ మూఢ నమ్మకాన్ని ఆసరాగా తీసుకుని ఓ దొంగ స్వామి 17 కాసుల బంగారంతో ఉడాయించాడు. కాకినాడ ఒకటో పట్టణ పోలీసులు తెలిపిన వివరాల మేరకు కాకినాడ జగన్నాథపురం శివాలయం వీధికి చెందిన డెన్నీస్ ప్రశాంత్ ఆంటోని స్థానిక షిప్పింగ్ కంపెనీలో పని చేస్తూంటాడు. ఈమె భార్య రాజేశ్వరి గృహిణి. ఈనెల 10 వ తేదీ శనివారం పూసలు, ఫాన్సీ సరకులు అమ్ముతామంటూ ఇద్దరు మహిళలు రాజేశ్వరి ఇంటికొచ్చారు. ఈ సందర్భంగా కొన్ని పూసలు, ఇతర ఫాన్సీ వస్తువులను కొనుగోలు చేసింది. మీ ఇంట్లో పరిస్థితి బాగోలేదు. మీకు మనశ్శాంతి ఉండటం లేదు.. పూజలు చేస్తే అంతా మంచి కలుగుతుంది.. మాకు తెలిసున్న స్వామీజీ ఒకరున్నారు. ఆయన వచ్చి పూజలు చేస్తే అంతా శుభం కలుగుతుందని నమ్మించారు. 12వ తేదీన ఇంట్లో భర్త, ఎవరూ లేని సమయంలో ఇరవై నుంచి ముప్పయ్యేళ్ల వయసున్న ఓ వ్యక్తి సాధువు వేషంలో వచ్చి వారంతా చెప్పారు. పూజ చేస్తే అంతా బాగుంటుందని నమ్మించాడు. పూజ ప్రారంభించిన కొద్దిసేపటికి బంగారు వస్తువులను పూజలో పెట్టాలి. ఇందుకు స్టీల్ బాక్స్, బంగారు వస్తువులు కావాలని కోరాడు. దొంగస్వామి సూచించిన మేరకు ఇంట్లో ఉన్న బంగారు వస్తువులను తీసుకువచ్చి స్టీల్ బాక్స్‌లో పెట్టింది. పూజకు పసుపు, కుంకుమ కావాలని, లోపలికెళ్లి తీసుకురావాలంటూ కోరాడు. రాజేశ్వరి లోపలికి వెళ్లి పసుపు, కుంకుమ తీసుకు వచ్చే లోపు అక్కడ పెట్టిన పెట్టె దాచి, తమ వెంట తెచ్చిన పెట్టెను పెట్టి దానిని దారంతో చుట్టాడు. కొద్ది సేపటికి పూజ పూర్తయ్యింది, రాత్రి పదిగంటల దాకా దాన్ని తెరవద్దని రాజేశ్వరి చేతిలో బాక్స్ పెట్టాడు. రాత్రి పదిగంటలకు బాక్స్ తెరచి చూడగా అందులో కేవలం ఒక రూపాయి బిళ్ల, గుప్పెడు బియ్యం ఉండటాన్ని చూసి నిర్ఘాంతపోయింది. జరిగిన మోసాన్ని గుర్తించిన రాజేశ్వరి మంగళవారం రాత్రి క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్సై శేషుకుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. 17 కాసుల బంగారం విలువ సుమారు రూ. 1.70 లక్షలు ఉంటుందన్నారు.
Advertisement
Advertisement