గుండె కోత
– పంటను చూసి మనోవేదనకు గురవుతున్న రైతన్నలు
– అప్పులెలా తీర్చాలో తెలీక సతమతం
– ప్రభుత్వ పెద్దల హామీ గంగ పాలు
– చేసేదిలేక బలవన్మరణాలకు పాల్పడుతున్న అన్నదాతలు
సకాలంలో వర్షాలు కురవకపోవడంతో పంట చేతికి రావడం లేదు. దీంతో అప్పులెలా తీర్చాలో తెలీక కొందరు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఒక్క శింగనమల నియోజకవర్గంలోనే ఇప్పటికే ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకోగా... మరొకరు గుండెపోటుతో Ðlుతి చెందారు.
శింగనమల : జిల్లాలో వేరుశనగ సాగుచేసిన రైతులకు ఈసారి కష్టాలు తప్పడం లేదు. ఎండిపోయిన వేరుశనగను చూసి ఆవేదనకు గురైన అన్నదాతలు ఈ మధ్యనే కురుస్తున్న వర్షాలకు ఊరట లభించినా... పచ్చగా ఉన్న పొలంలో కాయలు లేని వేరుశనగను చూసి కన్నీరుమున్నీరవుతున్నారు. ఒక్క ఎకరా కూడా ఎండిపోనివ్వం అన్న ప్రభుత్వ పెద్దల మాటలు నీటిమీద రాతలుగానే మారాయి. అవసరమైనప్పుడు నీళ్లిచ్చి ఆదుకొని ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని ఎంతో మంది అన్నదాతలు వాపోతున్నారు.
అప్పులెలా తీర్చాలో తెలీక...
ఖరీఫ్ సాగు కోసం చేసిన అప్పులను ఎలా తీర్చాలో తెలీక చాలా మంది రైతులు సతమతమవుతున్నారు. చేసేది లేక కొందరు రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు.
• గత నెల 26న శింగనమల మండలంలోని జూలకాల్వకు చెందిన తలారి నాగమునేశ్వర(35) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎండిన మూడున్నర ఎకరాల పొలాన్ని చూసి ఆవేదనతో పురుగుల మందు తాగి బలవన్మరణం చేసుకున్నాడు. ఈయనకు రూ. 3.50 లక్షల దాకా అప్పులున్నాయి.
• గత నెల 28న శింగనమల మండలం నాగులగుడ్డంతాండాకు చెందిన రాజునాయక్ (55) ఎండిన వేరుశనగను చూసి ఇంటికొచ్చి కన్నీరు మున్నారయ్యాడు. ఇందులో భాగంగానే గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచాడు. ఈయనకు దాదాపు రూ.2 లక్షల దాకా అప్పులు ఉన్నాయి.
• తాజాగా గురువారం శింగనమల పరిధిలోని చిన్నమట్లగొందిలో మహిళా రైతు సుంకమ్మ (40) కాయలు లేని వేరుశనగ పంటను చూసి తీవ్రంగా మనోవేదనకు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. వీరికి రూ. 4 లక్షల దాకా అప్పులు ఉన్నాయి.