ప్రాజెక్టులపై ఇంత నిర్లక్ష్యమా..?
► రాళ్లపాడు పరిరక్షణకు కదంతొక్కిన రైతులు
► ఆయకట్టు రైతులకు నీళ్లిచ్చి ఆదుకోవాలని డిమాండ్
► సోమశిల ఉత్తరకాల్వను పూర్తి చేయడంలో సర్కారు నిర్లక్ష్యంపై ఆగ్రహం
► వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త తూమాటి ఆధ్వర్యంలో ధర్నా
కందుకూరు : కందుకూరు నియోజకవర్గానికి జీవనాడి లాంటి రాళ్లపాడు ప్రాజెక్టు పట్ల్ల సర్కారు నిర్లక్ష్య వైఖరిపై ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్ పనులు పూర్తి చేయడంలో ప్రభుత్వ అలసత్వాన్ని నిరసిస్తూ సోమవారం భారీ ప్రదర్శన నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తూమాటి మాధవరావు ఆధ్వర్యంలో సోమవారం స్థానిక పామూరు బస్టాండ్ నుంచి ఎన్‌టీఆర్ సర్కిల్, అంకమ్మదేవాలయం మీదుగా పోస్టాఫీస్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం పోస్టాఫీస్ సెంటర్‌లో రాళ్లపాడు ప్రాజెక్టు పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాళ్లపాడుకు నీరందించే సోమశిల ఉత్తరకాల్వ నిర్మాణం, ప్రాజెక్టు ఎడమకాల్వ పొడగింపు పనులు పూర్తి చేయాలని, రాళ్లపాడు నుంచి నీళ్లు తరలించే జీఓ నంబర్ 40 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాధవరావు మాట్లాడుతూ రాళ్లపాడు ప్రాజెక్టుకు నీరందించే సోమశిల ఉత్తర కాల్వ నిర్మాణ పనులు పూర్తి చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. చింతలదీవి అనే గ్రామం వద్ద భూసేకరణ సమస్యను పరిష్కరించడంలో సర్కారు విఫలం అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు ఎడమ కాల్వ పొడగింపు పనులు మూడేళ్లుగా ప్రారంభానికి నోచుకోలేదని, భూసేకరణ గ్రామాల్లో సోషల్ ఇంపాక్టు సర్వే పూర్తి చేయడం కూడా ప్రభుత్వానికి చేతకాదా అని నిలదీశారు. ఈ కారణంతో పనులు ఆగాయంటే ప్రభుత్వ పనితీరు ఏవిధంగా ఉందో, కందుకూరు నియోజకవర్గం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చునన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా నేడు రైతులు గ్రామాలు వదిలి ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్తున్నారని ఇంతకంటే సిగ్గుచేటు ఇంకొకటి లేదని మండిపడ్డారు.
అధికారులకు వినతి పత్రాలు: అనంతరం ఆర్డీఓ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించి రాళ్లపాడు ప్రాజెక్టు రైతుల సమస్యలపై ఆర్డీఓ మల్లికార్జునకు వినతి పత్రం అందజేశారు. రాళ్లపాడు రైతులను ఆదుకోకపోతే గ్రామాలు ఖాళీ అవుతాయని చెప్పారు. స్పందించిన ఆర్డీఓ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. తర్వాత రాళ్లపాడు ప్రాజెక్టు కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించి ప్రాజెక్టు డీఈ శ్రీనివాసమూర్తికి వినతి పత్రం అందజేశారు. రాళ్లపాడు పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని, సమస్యను పరిష్కారం అయ్యే విధంగా ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రాళ్లపాడు ప్రాజెక్టు ఆయకట్టు మాజీ చైర్మన్ ఘనిపినేని నరశింహారావు, గుడ్లూరు జడ్‌పీటీసీ దోర్శిల వెంకట్రామిరెడ్డి, కందుకూరు, వలేటివారిపాలెం, లింగసముద్రం, ఉలవపాడు మండలాల కన్వీనర్లు కొత్తా రాఘవరెడ్డి, దామా ప్రవీణ్, చంద్రశేఖరరావు, కొండారెడ్డిపాలెం, బసిరెడ్డిపాలెం, అమ్మవారిపాలెం సర్పంచ్‌లు సురేష్, నరసింహ, మాలకొండయ్యలు, నాయకులు షేక్ రఫి, గణేశం గంగిరెడ్డి, దాసరి మాల్యాద్రి, వెంకటస్వామి, సుదర్శి శ్యామ్, ఎస్.సుధాకర్, థామస్, రాఘవ, వెంకట్, రాజారెడ్డి, వెంట్రామిరెడ్డి, నగళ్ల నారయ్య, హాజీమలాంగ, సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు.
జీఓ 40 అత్యంత దుర్మార్గం: ఒకపక్క ప్రాజెక్టుకు నీరు వచ్చే పూర్తి చేయకుండా మరోపక్క రాళ్లపాడు ప్రాజెక్టు నుంచి కామథేనువు ప్రాజెక్టు నుంచి నీటిని తరలించేందుకు ప్రభుత్వం జీవో నంబర్ 40ని విడుదల చేయడం మరీ దుర్మార్గంగా ఉందని తూమాటి పేర్కొన్నారు. ప్రాజెక్టులో నీరు లేక నాలుగేళ్లుగా కరువుకాటకాలతో అల్లాడుతుంటే ప్రాజెక్టు నుంచి నీటిని ఎలా తరలిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే కామథేను పశు అభివృద్ధి కేంద్రం భూముల్లోంచే సోమశిల కాల్వ వస్తున్నా అక్కడి నుంచి నీటిని మళ్లించకుండా, రాళ్లపాడు ప్రాజెక్టు నుంచి వెనక్కి 12కిలోమీటర్లు నీటిని తరలించడంలో ప్రభుత్వ ఉద్దేశం ఏంటని నిలదీశారు. ఇది పూర్తిగా రాళ్లపాడు ప్రాజెక్టును నిర్వీర్యం చేసు కుట్రను ప్రభుత్వం చేస్తుందని, దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.