నెలాఖరుకు రైతుల చేతికి ప్లాటు
నెలాఖరుకు రైతుల చేతికి ప్లాటు
Published Tue, Aug 9 2016 7:27 PM | Last Updated on Mon, Oct 1 2018 2:11 PM
అప్పటికి భూయాజమాన్య హక్కూ కల్పిస్తాం
‘సాక్షి’తో సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీధర్
సాక్షి, అమరావతి : రాజధాని గ్రామాల్లోని రైతులందరికీ సెప్టెంబర్ నెలాఖరుకల్లా వారి వాటా ప్లాట్లు పంపిణీ చేస్తామని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) కమిషనర్ చెరుకూరి శ్రీధర్ చెప్పారు. ఆ సమయానికి ప్లాట్ల కేటాయింపుతోపాటు వారికి భూసమీకరణ యాజమాన్య హక్కు పత్రాలు కూడా ఇస్తామని తెలిపారు. దీనివల్ల ప్లాట్లను అమ్ముకునే హక్కు రైతులకు ఉంటుందని వివరించారు. ఆయన సోమవారం ‘సాక్షి’తో మాట్లాడారు. ఇప్పటికే తుళ్లూరు మండలం నేలపాడు రైతులకు ప్లాట్లు కేటాయించామని, త్వరలో వారికి యాజమాన్య హక్కు పత్రాలు ఇస్తామని తెలిపారు. ఈ గ్రామంతోపాటు మరో ఏడు గ్రామాలకు ప్లాట్ల కేటాయింపు ముసాయిదా నోటిఫికేషన్లు ఇచ్చామని పేర్కొన్నారు. ఈ నెల 12వ తేదీన నాలుగు గ్రామాలు, 20వ తేదీన మరో నాలుగు గ్రామాలు, 26వ తేదీన ఎనిమిది గ్రామాలకు ముసాయిదా నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఆ తర్వాత ఆయా గ్రామాల రైతుల నుంచి అభ్యంతరాల స్వీకరణకు నెలరోజుల సమయం ఇస్తామన్నారు. వచ్చిన అభ్యంతరాలను బట్టి తుది ప్లాట్ల కేటాయింపు చేపడతామన్నారు. సెప్టెంబర్ నెలాఖరుకల్లా విడతల వారీగా 29 గ్రామాలకు ప్లాట్ల కేటాయింపుతోపాటు భూయాజమాన్య హక్కు పత్రాలు కూడా ఇస్తామని స్పష్టం చేశారు. రైతులకు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా యాజమాన్య హక్కు పత్రాలను ప్రత్యేకంగా రూపొందిస్తున్నామని వివరించారు. ఇందుకోసం ఎనిమిది భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నామని తెలిపారు. భూమి లేని పేదలకు ఇస్తున్న పెన్షన్లను ఇకపై ఆన్‌లైన్ ద్వారా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తామన్నారు. గతంలో ఎదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వారి బ్యాంకు అకౌంట్లు సరిగా ఉన్నాయో లేదో పరిశీలన చేయిస్తున్నామని చెప్పారు. జూన్, జూలై పెన్షన్ మొత్తాలు ఒకేసారి వారి ఖాతాల్లో జమవుతాయని తెలిపారు.
Advertisement