రైతులు కోరుకుంటే పక్కపక్కనే ప్లాట్లు
Published Thu, Oct 13 2016 8:23 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
* ప్రయోగాత్మకంగా అబ్బురాజుపాలెం,
బోరుపాలెంలో పంపిణీ చేసిన అధికారులు
తుళ్లూరు: రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు సీఆర్‌డీఏ తిరిగి ప్లాట్లు పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజధాని గ్రామాల రైతులు అనేక అనుమానాలున్నాయి. దీంతో ఐదారెకాలు పొలం ఉన్న రైతులు వారికిచ్చే ప్లాట్లు వేర్వేరు ప్రదేశాల్లో ఉండడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయాన్ని అధికారుల వద్ద అనేకసార్లు రైతులు విన్నవించారు. దీనిపై ఎట్టకేలకు సీఆర్‌డీఏ ఐటీ విభాగం అధికారి ఎన్.ప్రభాకర్‌రెడ్డి నేతృత్వంలో వంద గజాలు, ఆపైబడి ప్లాట్లు పొందే రైతులకు పక్క పక్కనే ఏర్పాటు చేసేలా సీఆర్‌డీఏ అధికారులు డిజైన్‌ను సిద్ధం చేశారు. గురువారం ప్రభాకర్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.
రాజధాని గ్రామాల రైతులు వంద గజాల ప్లాట్లకు పైబడి అలాగే ఒకటి, లేదా మరికొన్ని ప్లాట్లు పొందే అవకాశం ఉన్న రైతులు వారి ప్లాట్లను పక్కన పక్కనే పొందవచ్చని, ఈ మేరకు సీఆర్‌డీఏ లే అవుట్‌ను సిద్ధం చేసిందని వివరించారు. ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా బోరుపాలెం, అబ్బురాజుపాలెం రైతులకు వర్తింపజేసినట్లు వెల్లడించారు. బోరుపాలెంలో 37 మంది రైతుల్లో 36 మంది రైతులకు పక్కపక్కనే ప్లాట్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. గతంలో ప్లాట్లు పొందినవారైనా, ఇకపై ప్లాట్లు పొందే వారైనా పక్కపక్కనే ప్లాట్లు పొందే విధంగా డిజైన్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మరింత సమగ్రమైన సమాచారం కోసం తుళ్లూరు సీఆర్‌డీఏ కార్యాలయంలో ఐటీ విభాగాన్ని సంప్రదించాలని సూచించారు.
Advertisement
Advertisement