కాంగ్రెస్ కు ఫారూక్ ఝలక్
♦ గులాబీ గూటికి ఎమ్మెల్సీ
♦ కేసీఆర్ సమక్షంలో చేరిక
సిద్దిపేట జోన్ : కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో మరోగట్టి దెబ్బ తగిలింది. గత కొంత కాలంగా టీఆర్‌ఎస్ ఆకర్ష్‌కు కాంగ్రెస్, టీడీపీ పార్టీల ముఖ్య నేతలు వ లసబాట పట్టిన విషయం తెలిసిందే. జిల్లాలో రెండు ఎమ్మెల్సీలు ఉన్న కాంగ్రెస్‌కు ప్రస్తుతం ఉన్న ఒక్క నామినేటేడ్ ఎమ్మెల్సీ కూడా చేజారింది. దీంతో జిల్లాలో కాంగ్రెస్‌కు శాసన మండలిలో ప్రతినిధ్యమే కరువైంది. సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల్లో మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ ముఖ్యనేతగా వ్యవహరించిన ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ సోమవారం సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.
ఆయన చేరికతో రెండు నియోజకవర్గాల్లో భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. సిద్దిపేట నియోజకవర్గంలో ఫారూఖ్ పార్టీని వీడడం పట్ల కాంగ్రెస్ కార్యకర్తలు సంబురాలు జరుపుకొవడం విశేషం. కాగా రెండు నియోజకవర్గాల్లో ఇప్పటి వర కు కాంగ్రెస్ కార్యకలాపాలను నిర్వహించిన సీనియర్ నేత ఫారూఖ్ పార్టీ మారడం పరోక్షంగా కాంగ్రెస్‌కు షాకే..
సిద్దిపేటకు చెందిన ఫారూఖ్ హుస్సేన్ 1977లో మాజీ మంత్రి అనంతుల మదన్‌మోహన్ ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చారు. సిద్దిపేట మున్సిపల్ కౌన్సిలర్‌గా రెండుసార్లు పనిచేశారు. సమైక్య రా్రష్టంలో యువజన కాంగ్రెస్ జిల్లా, రాష్ట్రస్థాయి పదవుల్లో కొనసాగారు. 1991లో రాష్ట్ర కాంగ్రెస్ మైనార్టీసెల్ అధ్యక్షునిగా పనిచేశారు. 2004లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోని ప్రభుత్వంలో మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేశారు. 2011లో గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ పదవిని పొంది ప్రస్తుతం కాంగ్రెస్ శాసనమండలి సభ్యునిగా కొనసాగుతున్నారు.
ఆయన పదవీ కాలం వచ్చే యేడాది జూన్‌లో ముగియనుంది. హరీశ్‌రావు నియోజకవర్గంలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతినిధిగా ప్రొటోకాల్‌కు అనుగుణంగా ఆయన పనిచేశారు. గత కొంత కాలంగా ఆయన టీఆర్‌ఎస్‌తో సన్నిహితంగా ఉంటున్నారనే ఆరోపణలు ఉన్న క్రమంలో గత నెల రోజులుగా ఫారూఖ్ హుస్సేన్ పార్టీని వీడనున్నారనే ప్రచారం జిల్లాలో జోరుగా సాగింది.
ఆయన పదవీ కాలం మరో ఏడాది మాత్రమే ఉండడం భవిష్యత్తు రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని టీఆర్‌ఎస్‌లో చేరి, ఎమ్మెల్సీని రెండవ సారి దక్కించుకునే అలోచనతో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుతో ఉన్న సాన్నిహిత్యంతో పార్టీ మారినట్లు తెలిసింది. జిల్లాలో ఉన్న ఒకే ఒక కాంగ్రెస్ ఎమ్మెల్సీ కూడా టీఆర్‌ఎస్‌లో చేరడం కాంగ్రెస్‌కు దెబ్బే. మరోవైపు ఫారూఖ్ హూస్సేన్ పార్టీ వీడడం పట్ల సిద్దిపేట నియోజకవర్గంలోని కాంగ్రెస్ కార్యకర్తలు సోమవారం సంబురాలు నిర్వహించుకోవడం గమనార్హం.