ఫ్యాషన్.. సెన్సేషన్
-
ఫ్యాషన్ డిజైనింగ్ వైపు యువత చూపు
-
నగరంలో 50పైకు పైగా బొటిక్స్ సెంటర్లు
-
పది వరకు డిజైనింగ్ కోర్సుల నిర్వహణ
-
ఒక్క డిజైన్ క్లిక్ అయితే చాలు స్టార్ డమ్
స్మార్ట్ సిటీ యువత ఫ్యాషన్ డిజైనింగ్ వైపు పరుగులెడుతోంది. నిన్నా మొన్నటి వరకు ఇంటర్ పూర్తవగానే ఇంజినీరింగ్, ఎంబీబీఎస్ వైపు వెళ్లేందుకు ఆసక్తి చూపిన విద్యార్థుల ఆలోచనల్లో ప్రస్తుతం మార్పు వచ్చింది. నిత్యం మారుతున్న పోకడలకు తగ్గట్టు సజనాత్మకత ఉన్న ఫ్యాషన్ డిజైనర్లకు మంచి కెరీర్ దక్కే అవకాశాలుంటున్న నేపథ్యంలో.. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సుల్లో చేరేందుకు ఉత్సాహం కనబరుస్తున్నారు. ఈ క్రమంలో మహా నగరంలో డిజైనర్ బొటిక్స్ సంఖ్య పెరుగుతోంది. ఈ బొటిక్స్‌ను కొందరు డిజైనర్లు సొంతంగా నిర్వహిస్తుంటే.. మరికొందరు ప్రత్యేక కలెక్షన్ రూపకల్పనలో బిజీగా ఉన్నారు. ఇటీవల నిర్వహించిన ఫ్యాషన్ షో.. మిస్ ఆంధ్ర పోటీల్లో మగవలు ధరించిన డ్రెస్‌ల్లో చాలా మట్టుకు ఇక్కడ డిజైన్ చేసినవంటే అతిశయోక్తి కాదు.
సాగర్‌నగర్ : ప్రస్తుతం యువత ఫంక్షన్లలో ప్రత్యేకంగా కనిపించేందుకు ఒక్కో రకమైన డిజైనర్ దుస్తులను ధరిస్తోంది. ఆయా సందర్భాలకు తగ్గట్టుగా దుస్తులను రూపొందించే డిజైనర్ బొటిక్స్ సంఖ్య నగరంలో రోజురోజుకూ పెరుగుతోంది. ఈ బొటిక్స్‌లో డిజైనర్లు దుస్తులను రూపొందించడమే కాదు.. వాటిని ధరించే వారి ఎత్తు, బరువు, రంగు వంటి వాటిని బట్టి సరిపోయే దుస్తుల వర్ణాలను సైతం సూచిస్తున్నారు. ఇక వాటిపై కావాల్సిన యాక్సరీస్ కూడా అందుబాటులో ఉంచుతున్నారు. సిటీలో మొత్తం 50పైకు పైగా బొటిక్స్ సెంటర్లు ఉన్నాయి. వాటిలో పది వరకూ డిజైనింగ్ కోర్సులతో పాటు కలెక్షన్లు ఉన్నాయి. ద్వారకానగర్, ఎంవీపీ కాలనీ, ఆశీల్‌మెట్ట, దొండపర్తి, డైమండ్ పార్కు, ఏరియాలో పేరొందిన బొటిక్స్ డిజైనింగ్ సెంటర్లున్నాయి.
కోర్సు పూర్తి కాగానే క్యాంపస్ అవకాశాలు..
ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తి కాగానే క్యాంపస్ అవకాశాలు లభిస్తున్నాయి. ప్రస్తుతం అన్ని ఫ్యాషన్ డిజైనింగ్ కళాశాలలు తమ విద్యార్థులతో ఫ్యాషన్ షోలు నిర్వహిస్తున్నాయి. దీంతో ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజీ నుంచే కెరీర్‌ను విద్యార్థులు ప్రారంభిస్తున్నాయి. ఇక తమదైన డిజైన్లను ప్రదర్శించడానికి కూడా ప్రస్తుతం నగరంలో అనేక అవకాశాలున్నాయి. అనేక కార్పొరేట్ సంస్థలు ఫ్యాషన్ షోలకు స్పాన్సర్లగా ఉంటూ డిజైనర్లును ప్రొత్సహిస్తున్నాయి. ఈ షోలలో డిజైనర్ల కలెక్షన్ ఒక్కసారి క్లిక్ అయితే చాలు వారికంటూ సొంతం బ్రాండ్‌నేమ్ ఏర్పడిపోతుంది. అంతేకాదు బ్లెండర్స్ ఫ్రైడ్ ఫ్యాషన్ టూర్ తరహా ఫ్యాషన్ ఈవెంట్స్‌లలో అంతర్జాతీయ ర్యాంప్‌లపై కూడా వారి కలెక్షన్లను ప్రదర్శించే అవకాశం లభిస్తుంది.
ఆసక్తితో వచ్చి.. సొంతంగా బొటిక్ ప్రారంభం
ఎంబీఏ, ఎంసీఏ, చదువు పూర్తి చేసిన వారు ఫ్యాషన్ డిజైనింగ్‌పై ఉన్న ఆసక్తితో బొటిక్‌ను సొంతంగా ప్రారంభిస్తున్నారు. ఈ రంగంలోకి రావడానికి గల కారణాన్ని ‘సాక్షి’ ప్రశ్నించినప్పుడు ‘నాకు చిన్నప్పటి నుంచే రకరకాల దుస్తులు డిజైన్ చేయాలనే ఆసక్తి ఉండేది. అందుకే నా వార్డ్‌రోబ్‌లో ఎప్పుడూ సరికొత్త కలెక్షన్ డ్రస్‌లు ఉండేవి. ప్రతి సందర్భానికి ప్రత్యేక తరహా దుస్తులను డిజైన్ చేసే బొటిక్‌లు విశాఖలో ఎక్కువగా ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం మా బొటిక్స్‌లో ఎనిమిది మంది డిజైనర్లు పనిచేస్తున్నారు. సెలబ్రెటీలతోపాటు సాధారణ ఉద్యోగినులు కూడా డిజైనర్ దుస్తుల కోసం మా బొటిక్‌కి వస్తున్నారని ఓ ఫ్యాషన్ డిజైనర్ నిర్వాహకురాలు తెలిపారు.
సృజన ఉంటే.. విజయాలు మీ వెంటే...
సరికొత్తగా ఆలోచించ గలిగితే ఈ రంగంలో నిలదొక్కుకొని ఓ బ్రాండ్‌నేమ్‌ను తెచ్చుకోవడం అంత కష్టమేంకాదు. ప్రస్తుతం చీరలను కూడా ఫ్యాషనబుల్‌గా ధరించడానికి మహిళలు ఆసక్తి చూపుతున్నారు. కేవలం మోడ్రన్ దుస్తుల డిజైనింగ్ మాత్రమే కాదు బ్లౌజ్‌లను కూడా ఫ్యాషన్ డిజైనర్లు తమ కలెక్షన్‌లో అందుబాటులో ఉంచుతున్నారు. ఒక్క కలెక్షన్ క్లిక్ అయితే చాలు సెలబ్రేటీల వ్యక్తిగత డిజైనర్లగా, లేదంటే అంతర్జాతీయ బ్రాండ్‌ల డిజైనర్లగా మారిపోవవచ్చు. ప్రస్తుతం అనేక కార్పొరేట్ సంస్థలు ఫ్యాషన్ షోలకు స్పాన్సర్ షిప్ అందించడానికి ముందుకొస్తున్నాయి. గతంలో ముంబయి, బెంగళూరులోనే ఫ్యాషన్ డిజైనింగ్‌కు ఎక్కువ ఆదరణ ఉండేది. ప్రస్తుతం విశాఖ స్మార్ట్‌సిటీలో ఈ తరహా డిజైనింగ్‌లు క్రమేణా పెరుగుతున్నాయి.
–ప్రత్యూష్, ఫ్యాషన్ డిజైన్ నిర్వాహకురాలు