- ప్రైవేట్ పాలిటెక్నిక్‌ల అక్రమాలు..
- మేనేజ్‌మెంట్ పేరిట ‘స్పాట్’ అమ్మకాలు
‘స్పాట్’ ముసుగులో ఫీ‘జులుం’
Published Sun, Jul 24 2016 11:05 PM | Last Updated on Wed, Sep 5 2018 9:00 PM
కమాన్‌చౌరస్తా : పాలిసెట్ స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియను పలు కాలేజీలు పాతరేశాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ నెల 21న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించాల్సి ఉండగా, పలు కాలేజీలు దోపిడీకి తెరలేపాయి. స్పాట్ అడ్మిషన్లు చేపట్టకుండా... మేనేజ్‌మెంట్ కోటాలో సీట్లను అమ్ముకున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్పాట్ అడ్మిషన్లపై ఆశతో గురువారం ఆయా కాలేజీల్లో హాజరైన విద్యార్థులు.. అడిగినంత ఇచ్చుకోలేక వెనుదిరిగిన సంఘటనలున్నాయి.
మూడు రెట్లు అధికంగా..?
స్పాట్ అడ్మిషన్లకు ప్రభుత్వ కళాశాలల్లో రూ.4,600 ఫీజు ఉండగా, ప్రైవేట్ కాలేజీల్లో 16,500లుగా ప్రభుత్వం నిర్ణయించింది. పలు ప్రైవేట్ కాలేజీలు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుకు సుమారు రెండు నుంచి మూడు రెట్లు వసూలు చేసినట్లు సమాచారం. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుకే సీటివ్వాలని కొంతమంది విద్యార్థులు, తల్లిదండ్రులు వాదిస్తే... సీట్లు నిండిపోయాయని కుంటిసాకులు చెప్పి తప్పించుకున్నాయి. నిబంధనల ప్రకారం పత్రిక ప్రకటన జారీ చేసి స్పాట్ అడ్మిషన్లు నిర్వహించాల్సి ఉండగా.. చాలా కాలేజీలు దానిని పక్కపెట్టి అందనంత దండుకున్నాయనే విమర్శలున్నాయి.
ఖాళీలున్నా... కాసుల వర్షం..
జిల్లాలో నాలుగు ప్రభుత్వ పాలిటెక్నిక్‌లు, ప్రైవేట్ పాలిటెక్నిక్‌లు పది ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో 840 సీట్లలో 90 శాతం వరకు భర్తీకాగా 10శాతం సీట్లు స్పాట్‌కు మిగిలాయి. అవికూడా గురువారం సుమారుగా వందశాతానికి చేరినట్లు అధికార వర్గాల ద్వారా సమాచారం. ప్రైవేట్ కాలేజీల్లో సుమారుగా రెండు వేల సీట్లుండగా, రెండు దశల్లో కలిపి 75 శాతం సీట్లు భర్తీకాగా, 25 శాతం సీట్లు మిగిలాయి. ఇందులో గురువారం వరకు కేవలం 10 నుంచి 15 శాతం వరకు విద్యార్థులు ప్రవేశాలు పొందినట్లు సమాచారం.
ఆందోళనలో విద్యార్థులు..
స్పాట్ అడ్మిషన్ల ద్వారా సీట్లు పొందాలనుకున్న విద్యార్థులు అధిక ఫీజులతో ఆందోళనకు గురువుతున్నారు. పలు కారణాల వల్ల రెండు దశల కౌన్సెలింగ్‌లో సీట్లు పొందనివారు, దూరప్రాంతాల్లో సీటు వచ్చినా వెళ్లలేని పరిస్థితులో ఉన్నవారు స్పాట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ అవకాశం కూడా లేకపోవడంతో సంవత్సరం వృథా అవుతుందని భావించి కొందరు ఎంత చెబితే అంత ముట్టజñ ప్పి ప్రవేశాలు తీసుకుంటున్నారు. మరికొందరు ఆర్థిక ఇబ్బందుల వల్ల ప్రవేశాలు పొందలేక బాధపడుతున్నారు. స్పాట్ అడ్మిషన్లపై విచారణ నిర్వహించి, అక్రమాలు జరిగిన కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Advertisement
Advertisement