సినిమాలో హీరో వేషం ఇస్తానంటూ...
తాను తీయబోయే సినిమాలో హీరో వేషం ఇస్తానంటూ లక్షలాది రూపాయలు వసూలు చేసి సినిమా కంపెనీ మూసేసిన దర్శకుడిపై బాధితులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... నిజామాబాద్ జిల్లా బోధన్‌కు చెందిన రాజేంద్రనాయక్ అలియాస్ డీవీ. సిద్దార్థ్ ఫిలింనగర్‌లోని అపోలో రోడ్డులో ఓం సాయిరాం ప్రొడక్షన్స్ పేరుతో సినిమా కార్యాలయం తెరిచాడు.
తాను దర్శకుడిగా జూన్ 19న ప్రేమ + స్నేహం= సంగీతం అనే సినిమాను నిర్మిస్తున్నానని, ఇందుకు హీరోలు కావాలంటూ ప్రకటించాడు. దీంతో రంగారెడ్డి జిల్లా మేడ్చల్ సమీపంలోని రాయిలాపురం గ్రామానికి చెందిన శ్రావణ్‌కుమార్‌గౌడ్ తన అక్క పెళ్లి కోసం ఇంట్లో ఉంచిన రూ.4 లక్షలు దొంగచాటుగా తీసుకొని సినీ హీరో వేషం కోసం వచ్చి సిద్దార్థ్‌కు ఇచ్చాడు. శ్రావణ్‌తో పాటు అదే ప్రాంతానికి రాజశేఖర్ రూ.70 వేలు, కిషోర్ రూ.30 వేలు ఇలా చాలా మంది యువకులు వేషం కోసం డబ్బులు చెల్లించారు.
చెల్లించిన డబ్బులకు గాను సదరు డెరైక్టర్ బాండ్‌కూడా రాసిచ్చాడు. తీరా గత నెల 19న సినిమా ప్రారంభించాల్సి ఉండగా సిద్దార్థ్ మాయమాటలు చెప్పి దాటవేశాడు. ఈ నేపథ్యంలోనే వారం రోజుల నుంచి సినిమా కార్యాలయం ఎత్తేసి ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. మోసపోయానని తెలుసుకొని బాధితులు బుధవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సినిమాలో వేషాల పేరుతో తమతో పాటు చాలా మంది డబ్బులు చెల్లించారని వారు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని కోరారు.