రెండో వివాహం కేసులో ఐదుగురి అరెస్టు
Published Wed, May 24 2017 10:03 PM | Last Updated on Mon, Aug 20 2018 4:30 PM
- పెళ్లికుమారుడు, తమ్మునికోసం గాలింపు చర్యలు
- ఆత్మకూరు డీఎస్పీ సుప్రజ
జూపాడుబంగ్లా: మోతె వెంకటలక్ష్మిని మోసగించి రెండో వివాహం చేసిన కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ సుప్రజ తెలిపారు. బుధవారం స్థానిక పోలీసుస్టేషన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. సినిమా కో డైరెక్టర్‌గా హైదరాబాదులో పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్రం కొల్లాపూర్ గ్రామానికి చెందిన కురుమ్మూర్తికి ఇదివరకే విమల అనే మహిళతో వివాహమైందన్నారు. ఆ విషయాన్ని దాచిపెట్టి జూపాడుబంగ్లా గ్రామానికి చెందిన మోతె వెంకటలక్ష్మితో రెండోవివాహం చేయించారన్నారు. ఈ కేసులో నిందితులైన పెళ్లికుమారుని తండ్రి పెద్ద నరసింహుడు, తల్లి రమణమ్మ అలియాస్ మణెమ్మ, చిన్నాన్న చిన్ననరసింహులు, బంధువులు ఈశ్వరయ్య, కురుమయ్యలను బుధవారం ఎస్‌ఐ అశోక్ తన సిబ్బందితో కొల్లాపూర్ వెళ్లి అరెస్టు చేశారన్నారు. కేసులో ప్రధాన నిందితుడైన కురుమ్మూర్తి, అతని తమ్ముడు శ్రీనివాసులును రెండో రోజుల్లోగా అరెస్టు చేస్తామని డీఎస్పీ తెలిపారు. వారి ఆచూకీ కనుక్కొనేందుకు రెండు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు చెప్పారు. మహిళల జీవితాలతో చెలగాటం ఆడే వారికి చట్టపరంగా కఠిన శిక్షలు పడేలా చేస్తామన్నారు. అమ్మాయిలు కూడా అప్రమత్తంగా ఉంటూ మోసపోవద్దని డీఎస్పీ సూచించారు. నందికొట్కూరు సీఐ శ్రీనాథ్‌రెడ్డి, పోలీసుసిబ్బంది పాల్గొన్నారు.
Advertisement