'ఇక భయపడను.. నడిబొడ్డున తేల్చుకుంట'
హైదరాబాద్: విజయ్ గోపాల్ పెద్ద మోసగాడని నటి పూజిత అన్నారు. అతడిపై క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయని చెప్పారు. మంగళవారం తన భర్త మోసం చేశాడని, న్యాయం చేయాలని ఆమె హైదరాబాద్ నగర్ కమిషనర్ మహేందర్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. విజయ్ గోపాల్ తన భర్తే అనేందుకు కావాల్సిన ఆధారాలన్నీ ఆమె కమిషనర్ కు అందజేసినట్లు తెలిపారు. విజయ్ గోపాల్ ను వెంటనే అరెస్టు చేయాలని కోరారు. ఎంతోమందిని మోసం చేసిన విజయ్ గోపాల్ ఇటీవల ఐఏఎస్ రేఖారాణిని వివాహం చేసుకున్నాడని, అందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెప్పారు.
తనకు కొంతమంది నుంచి ప్రాణహానీ ఉందని, ముఖ్యంగా ఈ వ్యవహారం చూస్తున్న ఐపీఎస్ అంజనా సిన్హా నుంచి కూడా తనకు ప్రాణభయం ఉందని చెప్పారు. అందుకే తాను ఆరు రోజులపాటు అండర్ గ్రౌండ్లో ఉన్నానని, ఇప్పుడు బయటకు వచ్చానని నగరం నడిమధ్యలోనైనా ఈవిషయం తేల్చుకునేందుకు తాను సిద్ధమని ఆమె చెప్పారు. ఐఏఎస్ రేఖా రాణి, విజయ్ గోపాల్ పెళ్లికి మొదటి సాక్షి అంజనా సిన్హానే అని ఆమె అన్నారు. ఐపీఎస్ అంజనా సిన్హాని ఈ కేసు విచారణ నుంచి తప్పించాలని, ఈ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తనకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.