నెల్లూరు(పొగతోట): జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని, అందుకు ప్రతి ఒక్కరి సహకారం అందించాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పి. నారాయణ పేర్కొన్నారు. సోమవారం 70వ స్వాతంత్య్రదినోత్సవ వేడుకలను స్థానిక పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో ఘనంగా నిర్వహించారు. మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు.
-
వృద్ధి రేటులో జిల్లాకు 4వ స్థానం
-
రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ
-
ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
నెల్లూరు(పొగతోట): జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని, అందుకు ప్రతి ఒక్కరి సహకారం అందించాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పి. నారాయణ పేర్కొన్నారు. సోమవారం 70వ స్వాతంత్య్రదినోత్సవ వేడుకలను స్థానిక పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో ఘనంగా నిర్వహించారు. మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం మంత్రి ప్రసంగించారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన వసతులు ఉన్నాయన్నారు. పరిశ్రమల స్థాపన విషయంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. జిల్లాలో 19 మెగా ప్రాజెక్టులు, 42 భారీ పరిశ్రమలు రూ.30,772 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 48 వేల మందికి ప్రత్యక్షంగా, 32 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని తెలిపారు. జిల్లాలో రూ.11,354 కోట్ల పెట్టుబడుతలతో 13 పరిశ్రమలు స్థాపనకు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందన్నారు. కోట, చిల్లకూరు మండలాల్లో రూ.50 వేల పెట్టుబడులతో చెన్నై–బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకానుందన్నారు. 2.30 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పారిశ్రామికవాడలను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. రాష్ట్ర వృద్ధి రేటు 10.99 శాతం ఉందన్నారు. జిల్లా వృద్ధి రేటు 12.20 శాతంతో నాల్గవ స్థానంలో ఉందని తెలిపారు. వ్యవసాయ రంగంలో గత ఏడాది 19.35 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయిందన్నారు. వర్షపాతం 43 శాతం తక్కువగా ఉందన్నారు. జిల్లాలో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికి కృష్ణానది పరీవాహక ప్రాంతంలో తగినంత వర్షపాతం ఉన్నందున శ్రీశైలం జలాశయం నుంచి సోమశిల, కండలేరు జలాశయాలకు నీరు వస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు. హర్టికల్చర్ పంటల సాగు అధికం చేసేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఇ–మార్కెటింగ్ ద్వారా రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. నిరుపేద మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించేలా బ్యాంకుల ద్వారా రూ.751 కోట్ల రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్దేశించామన్నారు. రైతుల పొలాల్లో పంట సంజీవిని ద్వారా రూ.99 కోట్లతో 30 వేల నీటి కుంటలు నిర్మిస్తున్నామని తెలిపారు. రహదారుల అభివృద్ధి కోసం రూ 263 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఫ్లోరైడ్ ప్రాంతాల్లో ఆర్‌ఓ ప్లాంట్లు ఏర్పాటు చేసి మంచినీటిని అందిస్తున్నామన్నారు.
వచ్చే మార్చికి నెల్లూరు బ్యారేజి పనులు పూర్తి
నెల్లూరు బ్యారేజి, బ్రిడ్జి, సంగం బ్యారేజ్ పనులు వచ్చే ఏడాది మార్చినాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో 20,700 ఎకరాలకు సాగునీరు అందించేలా రూ.53 కోట్ల వ్యయంతో ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తున్నామని చెప్పారు. నగరంలోని ప్రజలకు మంచినీటిని అందించడానికి రూ 556 కోట్లు ఖర్చుతో పనులు ప్రారంభమయ్యాయన్నారు. రూ.580 కోట్లతో భూగర్భడ్రైనేజీ పనులు త్వరలో ప్రారంభంకానున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు, ఎస్పీ విశాల్‌గున్నీ, జాయింట్ కలెక్టర్ ఎ.మహమ్మద్‌ఇంతియాజ్, ఇన్‌చార్జి డీఆర్‌ఓ మార్కండేయులు, జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి, జేసీ–2 రాజ్‌కుమార్, టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, జెడ్పీటీసీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.