ఇంటికొకరుగా ఆర్మీ జవాన్లు
నాటి పీపుల్స్‌వార్ ఖిల్లా నుంచి నేడు దేశరక్షణకు సరిహద్దుల్లో యువకులు
ఒక్కో ఊరికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలా ఈ ఊరికి ఉన్న ప్రత్యేకత ‘దేశభక్తి’. దేశాన్ని కాపాడాలనే ధ్యేయంతో ఊరి యువకులు సైన్యం బాట పట్టారు. ఒకే ఊరి నుంచి ఇంటికి ఒక్కరు చొప్పున సుమారుగా 92 మందికిపైగా యువకులు సైన్యంలో తమ సేవలను అందిస్తున్నారు. ఫలితంగా ఒకప్పుడు పీపుల్స్‌వార్ ఖిల్లాగా ఉన్న ఆ ఊరిని ఇప్పుడు ఆర్మీ జవాన్ల పుట్టినిల్లుగా పిల్చుకుంటున్నారు. ఆ ఊరు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కట్కూర్ గ్రామం. ఆ ఊరి ముచ్చట్లలోకి వెళదామా?
సుమారు 40 ఏళ్ల క్రితం కట్కూర్ గ్రామానికి చెందిన జేరిపోతుల డేనియల్ మిలిటరీలో జవాన్ గా చేరాడు. ఆయన స్ఫూర్తితో గ్రామంలోని యువకులు సైన్యం బాటపట్టారు. ఇలా ఒకరిని చూసి మరొకరు ఆర్మీలో చేరారు. జవాన్ స్థాయి నుంచి లాన్స్‌నాయక్, నాయక్, హవల్దార్, నాయక్ సుబేదార్ స్థాయి వరకు వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. ఇలా గ్రామానికి చెందిన వారు ప్రస్తుతం 92 మంది ఆర్మీలో వివిధ హోదాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. దాంతో జిల్లాలో కట్కూరు గ్రామం అంటే ఆర్మీజవాన్ ల గ్రామంగా గుర్తింపు ΄÷ందింది. ఈ గ్రామంలో 1,014 కుటుంబాలుండగా జనాభా సుమారుగా 3,045 ఉన్నారు. అందులో మొత్తం గ్రామంలో 175 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. వీరిలో కొందరు ఇతర ఉద్యోగాలు చేస్తుండగా, మరికొందరు గ్రామంలో వ్యవసాయం చేసుకుంటున్నారు. – మాలోతు శ్రీనివాస్, సాక్షి, అక్కన్నపేట
దేశసేవ ఇష్టం...
దేశసేవ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే 1998లో భారతసైన్యంలో చేరాను. మద్రాస్ ఇంజినీరింగ్ గ్రూప్ బెంగళూర్‌లో ట్రైనింగ్ చేశాను. కార్గిల్ యుద్ధంలో కూడా పాల్గొన్నాను. కాశ్మీర్‌లో రాష్ట్రీయ విభాగంలో సేవలు అందించి అనేక టెర్రరిస్ట్ ఆపరేషన్ లలో పాల్గొన్నాను. కాశ్మీర్ సేవలను గుర్తించి నాకు సుబేదార్ మేజర్‌గా ప్రమోషన్ ఇచ్చారు. – పంజా సదయ్య, సుబేదార్
గర్వపడుతున్నా...
దేశరక్షణ కోసం సైన్యంలో పని చేస్తున్నందుకు గర్వపడుతున్నాను. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా దేశం కోసం పని చేయడం ఆనందంగా ఉంది. – కొయ్యడ శ్రీనివాస్, ఆర్మీ జవాన్
Comments
Please login to add a commentAdd a comment