బాబు వస్తున్నారని...!
కర్నూలులో చిన్న వీధులే కాదు ప్రధాన రహదారులను సైతం ఇప్పటిదాకా ఏ అధికారీ పట్టించుకోలేదు. వాహనాలపై వెళ్లేందుకు కాదు నడవడానికి సైతం ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కర్నూలులో పర్యటిస్తున్నారని అధికారులు హడావుడి చేస్తున్నారు. నగరాన్ని సుందరమయంగా, పసుపు మయంగా చేసేందుకు తమ వంతు చేయూతనందిస్తున్నారు. మురికి కాలువలపై బండలు వేయడం, డివైడర్లకు రంగులు వేయడం, సర్కిళ్లలో మొక్కలు నాటడం, గుంతలు పడ్డ రహదారులపై ప్యాచ్‌లు వేయడం, పేరుకుపోయిన మట్టిదిబ్బలను తొలగించడం, రహదారుల పక్కన ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించడం, ట్రాన్స్‌ఫార్మర్లకు రక్షణ గోడలు నిర్మించడం యుద్ధప్రాతిపదికన చేస్తున్నారు. ముఖ్యమంత్రికి కర్నూలు నగరం స్మార్ట్‌సిటీగా చూపించాలని అధికారులు తహతహ లాడుతున్నారు. అయితే నగరనడిబొడ్డున ఉన్న ఆర్టీసీ బస్‌స్టేషన్‌లో గుంతలను పూడ్చకుండా వదిలేశారు. కేవలం ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాల్లోనే సుందరంగా తీర్చిదిద్ది మార్కులు కొట్టేయాలని సర్వశక్తులు ఒడ్డుతుండటం విమర్శలకు తావిస్తోంది.